IND vs NZ 2nd Test : రికార్డులపై కోహ్లీ, మయాంక్ గురి...

     Written by : smtv Desk | Fri, Feb 28, 2020, 06:28 PM

IND vs NZ 2nd Test : రికార్డులపై కోహ్లీ, మయాంక్ గురి...

భార‌త్-న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య శ‌నివారం నుంచి రెండు టెస్టుల సిరీస్‌లో ఆఖ‌రిదైన రెండో మ్యాచ్ ప్రారంభం కానుంది. క్రైస్ట్‌చ‌ర్చ్‌లో జ‌రిగే ఈ టెస్టులో ఎలాగైనా నెగ్గాల‌ని భార‌త్ భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి, సిరీస్ కోల్పోయే ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకోవాల‌ని భావిస్తోంది. తొలి టెస్టులో బ్యాట్స్‌మెన్ వైఫ‌ల్యంతో భార‌త్ ప‌ది వికెట్ల‌తో చిత్తుగా ఓడిపోయింది. ఈక్ర‌మంలో సిరీస్‌లో 0-1తో వెనుకంజ‌లో నిలిచింది. ఈ టెస్టు తుది జ‌ట్టులో రెండు, మూడు మార్పులు చోటు చేసుకునే అవ‌కాశ‌ముంది. మ‌రోవైపు భార‌త జ‌ట్టుపై మ‌రో క్లీన్‌స్వీప్ కోసం కివీస్ త‌హ‌త‌హ‌లాడుతోంది. టీ20 సిరీస్‌ను 0-5తో కోల్పోయిన న్యూజిలాండ్‌.. మూడు వ‌న్డేల సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేసింది. ఇప్ప‌డు ఈ మ్యాచ్ గెలిచి టెస్టు సిరీస్‌ను కూడా క్లీన్‌స్వీప్ చేయ్యాల‌ని భావిస్తోంది. ఈ టెస్టుకు ముందు ఇరుజ‌ట్ల గ‌ణాంకాలు వివ‌రాలు.. న్యూజిలాండ్ గ‌డ్డ‌పై భార‌త్ చివ‌రిసారిగా 2009లో విజ‌యం సాధించింది. హామిల్ట‌న్‌లో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో ఆధిప‌త్యం క‌న‌బ‌ర్చిన టీమిండియా గెలుపొందింది. గ‌త 43 ఏళ్ల కాలంలో 19 టెస్టులు ఆడిన భార‌త్ ఎనిమిదింటిలో ఓడిపోగా.. ప‌ది మ్యాచ్‌ల‌ను డ్రాగా ముగించింది. శ‌నివారం జ‌రిగే రెండో టెస్టు ఇండియాకు చావోరేవోలాగా మారింది. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి సిరీస్ స‌మం చేయాల‌ని భార‌త్ భావిస్తోంది. అంత‌ర్జాతీయంగా 22వేల ప‌రుగుల మార్కును చేరుకునేందుకు భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీకి మ‌రో 116 ప‌రుగులు కావాలి. రెండో టెస్టులో ఈ ప‌రుగులు చేస్తే 22వేల మార్కును అందుకున్న మూడో భార‌త ప్లేయ‌ర్‌గా నిలుస్తాడు. అలాగే అత్యంత వేగంగా ఈ ఘ‌న‌త‌ను చేరుకున్న ప్లేయ‌ర్‌గా రికార్డుల‌కెక్కుతాడు. ప్ర‌స్తుతం కోహ్లీ ఖాతాలో 21,884 ర‌న్స్ ఉన్నాయి. కోహ్లీ కంటే ముందు స‌చిన్, రాహుల్ ద్ర‌విడ్ ఉన్నారు. భార‌త టెస్టు ఓపెన‌ర్ మ‌యాంక్ అగ‌ర్వాల్‌ వెయ్యి ప‌రుగుల మార్కును చేరుకునేందుకు మ‌రో 36 ప‌రుగుల దూరంలో నిలిచాడు. రెండో టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో మ‌రో 36 ప‌రుగులు సాధిస్తే అత్యంత వేగంగా వెయ్యి ప‌రుగులు సాధించిన రెండో భార‌త‌ క్రికెట‌ర్‌గా వినోద్ కాంబ్లీ త‌ర్వాత మ‌యాంక్ నిలుస్తాడు. గతంలో కాంబ్లీ 14 ఇన్నింగ్స్‌ల‌లోనే వెయి పరుగుల మార్కును అందుకున్నాడు. మ‌రోవైపు రెండో టెస్టు మ‌యాంక్‌కు కెరీర్‌లో 11వ‌ది కావ‌డం విశేషం. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో క‌లిపి 36 ర‌న్స్ చేస్తే అతి త‌క్కువ టెస్టుల్లో వెయ్యి ప‌రుగుల మార్కును చేరిన భార‌తీయునిగా సంయుక్తంగా రికార్డుల‌కెక్కుతాడు. ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో భార‌త ఆట‌గాడు శుబ్‌మాన్ గిల్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. క‌నీసం 2వేలు ప‌రుగులు సాధించిన ఆట‌గాళ్ల‌లో త‌న‌ది రెండో అత్య‌ధిక స‌గ‌టు (73.55) కావ‌డం విశేషం. ఆస్ట్రేలియా దిగ్గ‌జం స‌ర్ డొనాల్డ్ బ్రాడ్‌మ‌న్ మాత్ర‌మే అత‌నికంటే ముందున్నాడు. బ్రాడ్‌మ‌న్ స‌గ‌టు 95.14 కావ‌డం విశేషం. ఇక న్యూజిలాండ్‌టో జ‌రిగిన ఫ‌స్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో త‌ను 161.67 స‌గటుతో పరుగులు సాధించాడు. ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లోనూ 50+ స్కోర్లు సాధించాడు. భార‌త వ‌న్‌డౌన్ బ్యాట్స్‌మ‌న్ చ‌టేశ్వ‌ర్ పుజారాకు న్యూజిలాండ్‌పై పేల‌వ రికార్డు ఉంది. ఇక్క‌డ ఆరు ఇన్నింగ్స్‌లు ఆడిన పుజారా.. కేవ‌లం 82 ప‌రుగులే సాధించాడు. స‌గ‌టు 13.67 కావ‌డం గ‌మ‌నార్హం. ఇక్క‌డ మూడు టెస్టులు ఆడిన పుజారా అత్య‌ధిక స్కోరు 23 కావ‌డం విశేషం. మ‌రోవైపు 2019లో సిడ్నీక్రికెట్ మైదానంలో 193 ప‌రుగులు చేశాక, ఆడిన 12 ఇన్నింగ్స్‌ల్లో క‌నీసం ఒక్క శ‌త‌కాన్ని కూడా బాద‌లేక‌పోయాడు. టెస్టు క్రికెట్లో భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీపై న్యూజిలాండ్ పేస‌ర్ నీల్ వాగ్న‌ర్ ఆధిప‌త్యం కొన‌సాగుతోంది. ఇప్ప‌టివర‌కు మూడు సార్లు కోహ్లీని ఔట్ చేసిన వాగ్న‌ర్‌.. కేవ‌లం 60 ప‌రుగులు మాత్ర‌మే స‌మ‌ర్పించుకున్నాడు. ఇక టీమిండియాలో వాగ్న‌ర్ చేతిలో అత్య‌ధిక సార్లు ఔట‌య్యింది కోహ్లీనే కావ‌డం విశేషం. బిడ్డ పుట్ట‌డంతో తొలి టెస్టుకు వాగ్న‌ర్ సెల‌వు తీసుకున్నాడు. రెండో టెస్టులో ఆడ‌తాడు. ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్లో 600 వికెట్ల‌ను పూర్తి చేసుకునేందుకు భార‌త స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్‌కు రెండు వికెట్లు కావాలి. అశ్విన్ త‌న కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 350 టెస్టు వికెట్లు తీశాడు. అలాగే 550 అంత‌ర్జాతీయ వికెట్ల‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్ర‌స్తుతం టీమిండియాకు కేవ‌లం టెస్టుల్లోనే అశ్విన్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు. అలాగే మ‌రో రెండు వికెట్ల‌ను సాధిస్తే కివీస్‌పై 50 టెస్టు వికెట్ల‌ను పూర్తి చేసుకుంటాడు. న్యూజిలాండ్ టూర్‌లో వ‌రుస‌గా ఐదు టీ20లు గెలుపొందిన త‌ర్వాత భార‌త్‌కు వ‌రుస‌గా ప‌రాజ‌యాలు ఎదుర‌వుతున్నాయి. మూడు వ‌న్డేలు, ఒక టెస్టు క‌లిపి వ‌రుస‌గా నాలుగు మ్యాచ్‌ల్లో భార‌త్ ప‌రాజ‌యం పాలైంది. మ‌రో ప‌రాజ‌యం సాధిస్తే, చెత్త రికార్డును మూట‌గట్టుకుంటుంది. 2011/12 ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో భార‌త్ వ‌రుస‌గా ఐదు అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల‌ను ఓడిపోయింది. ప్ర‌స్తుతం భార‌త్ అదే స్థితిలో నిలిచింది. క్రైస్ట్‌చ‌ర్చ్‌లోని హాగ్లీ ఓవ‌ల్ మైదానంలో న్యూజిలాండ్‌కు అద్భుత రికార్డు ఉంది. ఇక్క‌డ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాల్గింటిలో విజ‌యం సాధించింది. ఒక మ్యాచ్‌ను డ్రాగా ముగించిన కివీస్‌.. మ‌రో మ్యాచ్‌లో ఓడిపోయింది. అదికూడా 2016లో ఆస్ట్రేలియా చేతిలో ప‌రాజ‌యం పాల‌వ‌డం విశేషం. ఇక భార‌త్ ఇక్క‌డ తన తొలి టెస్టును ఆడుతోంది. మ‌రోవైపు ఈ వేదికపై 17 అంత‌ర్జాతీయ మ్యాచ్‌లాడిన కివీస్‌.. 13-3తో చాలా ముందంజ‌లో ఉంది. సొంత‌గడ్డ‌పై జ‌రిగిన గత ఐదు టెస్టు సిరీస్‌ల‌ను న్యూజిలాండ్ గెలుపొందింది. టెస్టు ఫార్మాట్ల‌లో కివీస్‌కిదే అజేయ ప‌రంప‌ర కావ‌డం విశేషం. రెండు టెస్టును విజ‌యం లేదా క‌నీసం డ్రాగా ముగించినా, ఈ ప‌రంప‌ర ఆరు సిరీస్‌ల‌కు పెరుగుతుంది. చివ‌రిసారిగా సొంత‌గ‌డ్డ‌పై సౌతాఫ్రికా చేతిలో కివీస్ సిరీస్ ఓడిపోయింది. ఆ సిరీస్‌ను 0-1తో న్యూజిలాండ్ కోల్పోయింది. సొంత‌గ‌డ్డ‌పై జ‌రిగిన 16 టెస్టుల్లో టాస్ నెగ్గిన అనంత‌రం న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ 16 సార్లు కివీస్ అజేయంగా కొన‌సాగుతోంది. 2011లో వెల్లింగ్ట‌న్ వేదిక‌గా పాకిస్థాన్‌తో జ‌రిగిన టెస్టులో మాత్ర‌మే చివ‌రిసారి టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈసారి కూడా రెండో టెస్టులో న్యూజిలాండ్ టాస్ నెగ్గితే బౌలింగ్ ఎంచుకునే అవ‌కాశాలున్నాయని క్రికెట్ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.


భారత్ జట్టు:

పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, శుబ్మాన్‌ గిల్‌, రిష‌బ్ పంత్‌, ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, ఇషాంత్ శ‌ర్మ‌, న‌వ‌దీప్ సైనీ

​న్యూజిలాండ్ జ‌ట్టు:

కేన్ విలియ‌మ్స‌న్ (కెప్టెన్‌), టామ్ లాథ‌మ్‌, టామ్ బ్లండెల్‌, రాస్ టేల‌ర్‌, హెన్రీ నికోల్స్‌, వాట్లింగ్‌, కొలిన్ డి గ్రాండ్‌హోమ్‌, టిమ్ సౌతీ, నీల్ వాగ్న‌ర్‌, ట్రెంట్ బౌల్ట్‌, ఏజాజ్ ప‌టేల్‌, కైల్ జేమీస‌న్‌, డారైల్ మిషెల్‌.






Untitled Document
Advertisements