జగన్ నిర్ణయంపై పవన్ హర్షం...

     Written by : smtv Desk | Fri, Feb 28, 2020, 06:36 PM

జగన్ నిర్ణయంపై పవన్ హర్షం...

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కర్నూలు బాలిక గీత అత్యాచారం, హత్యకేసును జగన్ సర్కార్ సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. బాలిక కేసులో కోరిందే జరిగిందని.. ఈ కేసును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ)కి అప్పగించడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. జగన్‌ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రతి ఒక్కరినీ పేరుపేరునా అభినందిస్తున్నాను అన్నారు పవన్ కళ్యాణ్. మూడేళ్ళ కిందట పాఠశాలకు వెళ్లిన బాలికపై అత్యాచారం, హత్య జరిగిందని తెలుసుకున్న ఆమె తల్లిదండ్రుల కడుపు కోత, ఆవేదన, ఆక్రందన నేను స్వయంగా చూశాను. తన బిడ్డ కేసులో న్యాయం కోసం ఆమె తల్లిదండ్రులు పడిన కష్టం పగవాడికి సైతం రాకూడదు అన్నారు. నడవలేని ప్రీతీ తల్లి చక్రాల కుర్చీలో మంగళగిరిలో జనసేన కార్యాలయానికి వచ్చినప్పుడు.. ఆమె చెప్పిన అమానుష సంఘటన గురించి విన్న తరువాత ఈ పరిస్థితి ఏ పసిపాపకూ రాకూడదని భావించాను అన్నారు పవన్. ఆ సంకల్పంతోనే ఈ నెల 12న కర్నూలు వీధులలో ఈ బాలిక కేసులో న్యాయం కోసం నినదించానన్నారు జనసేనాని. చివరికి ఆ బాలిక తల్లిదండ్రులకు ఇన్నాళ్లకు స్వాంతన కలిగిందని.. ఈ పోరాటంలో అండగా ఉన్న కర్నూలు ప్రజానీకానికి, పాత్రికేయులకు, ప్రజా సంఘాలకు అభినందనలు తెలిపారు.ఇటువంటి అమానవీయ సంఘటనలు జరగకుండా చూడవలసిన బాధ్యత ఇటు ప్రభుత్వంపై, అటుసమాజంపై ఎంతైనా ఉందని వ్యాఖ్యానించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ మేరకు జనసేన పార్టీ తరపున ప్రకటన విడుదల చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు బాలిక కేసులో న్యాయం చేయాలని కర్నూల్‌లో మార్చ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పవన్ డిమాండ్ చేశారు. జగన్ సర్కార్ స్పందించకపోతే తాను నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. తర్వాత ముఖ్యమంత్రి జగన్ కర్నూలు పర్యటనకు వచ్చిన సందర్భంలో బాలిక కుటుంబ సభ్యులు కలిసి న్యాయం చేయాలని కోరారు. ఈ కేసును సీబీఐకి రిఫర్ చేస్తున్నామని.. తప్పకుండా న్యాయం జరుగుతుందని జగన్ బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సీబీఐకి కేసును అప్పగించారు. కర్నూలుకు చెందిన బాలిక 2017 ఆగస్టు 19న అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. చదువుతున్న స్కూల్‌లోనే ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయినట్లు యాజమాన్యం చెప్పింది. కానీ ఆమెను అత్యాచారం చేసి హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. పోస్ట్‌మార్టంలో బాలికపై అత్యాచారం జరిగినట్లు తేలగా.. కుటుంబసభ్యులు స్కూల్ యజమానితో పాటు అతడి కుమారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిందితులపై పోలీసులు పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. కానీ కేసు విచారణ ముందుకు సాగలేదు.. అప్పటి నుంచి తమ బిడ్డకు న్యాయం చేయాలంటూ బాలిక కుటుంబం పోరాటం చేసింది.







Untitled Document
Advertisements