నుదుటిపై ముడతలు పోవటం ఎలా?

     Written by : smtv Desk | Sat, Nov 18, 2017, 03:33 PM

నుదుటిపై ముడతలు పోవటం ఎలా?

హైదరాబాద్, నవంబర్ 18: నుదుటిపై ముడతలు పోవు. అయితే పెరగకుండా చూసుకోవచ్చు. వయసు పెరిగేకొద్దీ నుదుటిమీద సన్నని గీతలు మొదలవుతాయి. అక్కడి నుంచే ముడతలు వస్తాయి. వాటిని ప్రిమెచ్యూర్‌ రింకిల్స్‌ అంటారు. బాగా తెల్లగా ఉన్నవారిలో, చర్మం పల్చగా ఉన్నవారిలో ఇవి త్వరగా మొదలవుతాయి. ఎండలో ఎక్కువగా తిరిగేవారిలో, కొన్నిసార్లు వంశపారంపర్యంగానూ ఈ సమస్య ఎదురుకావచ్చు. పొడిచర్మం ఉన్నవారూ, బ్లీచింగ్‌ ఎక్కువగా వాడేవారిలోనూ ఇవి త్వరగా కనిపిస్తాయి. ఊబకాయులు శస్త్రచికిత్స ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గినా కూడా ముడతలు వస్తాయి. ఎక్కువగా వ్యాయామాలూ, డైటింగ్‌లు చేసేవారిలోనూ ఈ సమస్య కనిపిస్తుంది.

ఈ సమస్య పెరగకుండా ఉండాలంటే ముందు సమతులాహారం తీసుకోవాలి. రోజూ 3 - 4 లీటర్ల వరకు నీరు తాగాలి. మాయిశ్చరైజర్‌ రాసుకుని ఆ పైన సన్‌స్క్రీన్‌ వాడాలి. వచ్చిన ముడతలు పెరగకుండా ఉండాలంటే రెటినాయిక్‌ యాసిడ్‌ ఉన్న క్రీంలు వాడుతూ కెమికల్‌ పీల్‌, మైక్రో డెర్మాబ్రేషన్‌ లాంటివి చేయించుకోవాలి. లేజర్‌ చికిత్స కూడా కొంతవరకూ ఉపయోగపడుతుంది. ఒకసారి బొటాక్స్‌ ఇంజెక్షన్‌ చేయించుకుంటే దాదాపు ఏడాది వరకూ ముడతలు కనిపించవు. ఈ జాగ్రత్తలు తీసుకుంటూనే ఎండలోకి ఎక్కువగా వెళ్లకుండా చూసుకోవాలి. ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. విటమిన్‌ సి ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవాలి. రోజూ కనీసం ఏడెనిమిది గంటలు నిద్రపోవాలి.





Untitled Document
Advertisements