ఉప్పల్ స్టేడియంలో క్వారంటైన్...

     Written by : smtv Desk | Thu, Mar 26, 2020, 01:55 PM

ఉప్పల్ స్టేడియంలో క్వారంటైన్...

కరోనా వైరస్ దేశవ్యాప్తంగా మెలమెల్లగా విస్త‌రిస్తున్న‌ వేళ అనేక రకాలుగా సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ కోల్‌క‌తాలోని ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్ స్టేడియంలో క్వారంటైన్ స‌దుపాయం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. తాజాగా హైదరాబాద్ క్రికెట్ సంఘం కూడా ఇదే విధంగా స్పందించింది. తెలంగాణ ప్రభుత్వం కావాలనుకుంటే ఉప్పల్ స్టేడియంలో క్వారంటైన్‌ సేవలు కల్పిస్తామని ఈ సందర్భంగా హెచ్‌సీఏ కార్యదర్శి విజ‌యానంద్‌ ప్రభుత్వానికి లేఖ రాశారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ తరఫున ఈ లేఖ రాసినట్టు ఆయ‌న తెలిపారు. కరోనా ను ఎదుర్కోవడంలో తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుంద‌ని, ప్రభుత్వానికి తమ వంతు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు హెచ్‌సీఏ వర్గాలు తెలిపాయి. ఉప్పల్ స్టేడియంలోని 40 పెద్ద గదుల్లో క్వారంటైన్ సౌక‌ర్యాలు ఏర్పాటు చేయవచ్చని సూచించారు. ఉప్పల్ స్టేడియం లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని ప్రభుత్వానికి తెలిపారు. మరోవైపు క‌రోనాను ఎదుర్కోవడంలో తెలంగాణ ప్రభుత్వం అందరికీ ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. కరోనా వైరస్ తీవ్రతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం.. జనసమ్మర్థ‌త గల ప్రాంతాలైన‌ సినిమాహాల్స్‌, షాపింగ్ మాల్స్‌, ఫంక్ష‌న్ హాళ్లులాంటి ప్రాంతాలను నిషేధించిన సంగతి తెలిసిందే. అనంతరం తెలంగాణ రాష్ట్రాన్ని లాక్‌డౌన్‌గా ప్రకటిస్తున్నట్లు, ప్రజలందరూ ఇంటిలోనే గడపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ నిర్ణయం వెలువడిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్‌ ప్రకటిస్తున్నట్లు మంగళవారం రాత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక దేశవ్యాప్తంగా కరుణ పాజిటివ్ కేసుల సంఖ్య 600కు చేరింది. ఇప్పటికే 11 మంది మరణించారు.





Untitled Document
Advertisements