కరోనా విజృంభణ: ప్రగతి భవన్‌లో కేసీఆర్ అత్యవసర సమావేశం

     Written by : smtv Desk | Sun, Mar 29, 2020, 11:07 AM

కరోనా విజృంభణ: ప్రగతి భవన్‌లో కేసీఆర్ అత్యవసర సమావేశం

తెలంగాణలో రోజురోజుకూ కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యవసర, అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో ఈ అత్యున్నత స్థాయి భేటీ జరగనుంది. కరోనా వ్యాప్తి నిరోధక చర్యలను అమలు చేస్తుండడంపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. అంతేకాక, ప్రస్తుత లాక్ డౌన్‌ను మరింత పటిష్ఠంగా అమలు చేసే అంశంపైనా చర్చిస్తున్నారు. క్వారంటైన్‌లో ఉన్నవారి పర్యవేక్షణ, వైద్య సౌకర్యాలపై చర్చించనున్నారు. మందులు, సామగ్రి లభ్యత, విశ్రాంత వైద్యులు, ఇతర సిబ్బందిని రిక్రూట్ చేసుకోవడం వంటి అంశాలపైనా చర్చ జరపనున్నారు. ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణను చేపట్టే అవకాశం ఉంది.



ఈ అత్యవసర, అత్యున్నత స్థాయి భేటీ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం 5 గంటలకు అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఇది పూర్తయ్యాక రాత్రి కరోనా నిరోధానికి మరికొన్ని అంశాలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు, ఎస్పీలు, డీఎంహెచ్‌వోలు, వ్యవసాయ, సివిల్ సప్లయ్‌ అధికారులు పాల్గొననున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో ప్రధానంగా కరోనా వైరస్ నియంత్రణ, లాక్‌డౌన్, నిత్యావసర వస్తువుల సరఫరా, ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లు తదితరవాటిపై చర్చించనున్నట్లు సమాచారం.


కాగా శనివారం ఒక్కరోజే తెలంగాణలో 8 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ పరీక్షల్లో తేలింది. ఈ 8 మందిలో ఒకరు మరణించారు. తెలంగాణలో ఇప్పటివరకు 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 65 మందికి ప్రభుత్వం చికిత్సను అందిస్తోంది. మిగిలిన ఇద్దరిలో ఒకరు చనిపోయారు. మరొకరు పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయ్యారు.





Untitled Document
Advertisements