ఇవి ఫాలో అయితే మీ బైక్ మైలేజ్ పెరగడం ఖాయం...

     Written by : smtv Desk | Sun, Mar 29, 2020, 01:53 PM

ఇవి ఫాలో అయితే మీ బైక్ మైలేజ్ పెరగడం ఖాయం...

బైక్.. నేటితరం యువత, ఉద్యోగులు, వృద్ధులు ఏ వయసు వారైనా.. బండి అవసరం సర్వసాధారణమై పోయింది. ఆఫీసు, ఆసుపత్రి, ఆరుబయటకు ఎక్కడికి వెళ్లాలన్నా.. బైక్ తీసుకొని రయ్యమని దూసుకెళ్లాల్సిందే. అంతగా ఆధునిక సమాజంలో బండి భాగమైపోయింది. మరీ ఇంత బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరిది ఒకటే సమస్య. అదే మైలేజి. లీటరుకు కనీసం 40 కిలోమీటర్లు కూడా రావడం లేదని చాలా మంది వాపోతుంటారు. మరీ ఈ మైలేజీ సమస్యను అరికట్టడమెలా? మైలేజిని పెంచేందుకు ఏం చేయాలి? అసలు ఏమైనా పరిష్కార మార్గాలున్నాయా? అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్నలు. మరి ఈ ప్రశ్నలకు సమాధానమేంటో ఇప్పుడు చూద్దాం.

​రెగ్యులర్ సర్వీసింగ్...

వాహనదారులు విస్మరిస్తున్న ముఖ్యమైన విషయం సర్విసింగ్. రెగ్యులర్ గా సర్విసింగ్ చేయించకుండా తమ పనిలో పడి ఈ అంశాన్ని మర్చిపోతున్నారు. ఇది బైక్ మైలేజినివ్వడంలో కీలక పాత్రపోషిస్తుంది. రెగ్యులర్ గా సర్వీసింగ్ చేయించడం వల్ల ఇంజిన్ సక్రమంగా పనిచేయడమే కాకుండా.. జీవితకాలం పెరుగుతుంది. అంతేకాకుండా మైలేజినీ పెంపొదిస్తుంది.

​కార్బురేటర్..

రెగ్యులర్ గా సర్వీసింగ్ చేయిస్తున్నప్పటికీ బండి మైలేజి రాకపోతే.. కార్బురేటర్ సెట్టింగ్స్ చెక్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు కార్బురేటర్ పనితీరును గమనిస్తూ రీ ట్యూనింగ్ చేయించాలి. దీని వల్ల ఇంజిన్ ప్రదర్శన మెరుగై.. మైలేజీనివ్వడంలో తోడ్పడుతుంది.

​టైర్ ప్రెజర్..

టైరుల్లో గాలి ఉందో లేదో ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి. ముఖ్యంగా లాంగ్ రైడ్ లు వెళ్తున్నప్పుడు, దూర ప్రయాణాలు చేసేముందు టైర్ ప్రెజర్ ను గమనించాలి. ఇంధనం కొట్టించుకునేముందు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.

​ఇంజినాయిల్..

ఇంజిన్ బాగా పనిచేసేందుకు ఇంజినాయిల్ కీలక పాత్ర పోషిస్తుంది. తక్కువ ధరకు దొరుతుంది కదా అని ఏది పడితే వాడితే.. ఇంజిన్ పై ప్రభావం చూపిస్తుంది. ఇందుకోసం ప్రమాణికమైన ఇంజినాయిల్ వాడటం ఎంతో బెటర్. ఇంజిన్ ప్రదర్శనలో ఇంజిన్ ఆయిల్ మంచిగా పనిచేస్తుంది.

​ర్యాష్ డ్రైవ్..

చాలా మంది కొత్తగా బైక్ తీసుకుంటే వేగంగా ప్రయాణించడానికి ప్రాధాన్యమిస్తారు. దీనికి దూరంగా ఉండాలి. ర్యాష్ డ్రైవింగ్ ప్రమాదమే కాకుండా బైక్ కూ నష్టాన్ని కలగజేస్తుంది. దీర్ఘకాలంలో ఇంజిన్ ప్రదర్శనపై దీని ప్రభావముంటుంది. అంతేకాకుండా ర్యాష్ డ్రైవ్ వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశమెక్కువ.

​వేగాన్ని అదుపులో ఉంచాలి..

కొన్ని ప్రత్యేక పరిస్థితులు, ప్రాంతాల్లో పరిమిత వేగంతో వెళ్లాలి. ముఖ్యంగా పాఠశాలలు, ఆసుపత్రి, పార్కులు లాంటి జనాలు ఎక్కువగా ప్రదేశాల్లో నిర్ణీత స్పీడుతో వెళ్లాలి. మెట్రో నగరాలు, ఓ మాదిరి పట్టణాల్లో వేగం గంటకు 40 కిలోమీటర్లు దాటకపోవడం మంచిది. 40లోపు వేగంతో ప్రయాణిస్తే మైలేజి కూడా పెరుగుతుంది.

​ఇంజిన్ ఆపాలి..

నగరాల్లో ఉండేవాళ్లు.. సిగ్నల్స్ వద్ద ఎక్కువ సేపు ఎదురుచూడాల్సి రావచ్చు. అలాంటి సమయాల్లో ఇంజిన్ ఆపకుండా చాలా సేపు అలాగే ఉంచుతుంటారు. 30 సెకండ్ల కంటే ఎక్కువ సేపు ఎదురుచూడాల్సిన సందర్భాల్లో ఇంజిన్ ను ఆఫ్ చేస్తే మంచిది. దీనివల్ల ఇంజిన్ కు విశ్రాంతి దొరకడం, ఆయిల్ ఆదా అవ్వడమే కాకుండా ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది.

​ఎండలో పార్కింగ్ చేయొద్దు..

కాసేపు మనం ఎండలో తిరిగితే అలసట వస్తుంది ఓకే.. కానీ బండికి ఏమవుతుంది చెప్మా అని అనుకుంటున్నారా.. ఎండలో ఎక్కువ సేపు బైక్ ను పార్క్ ను చేసినప్పుడు అందులో మనం వాడే.. పెట్రోల్, డిజీల్ లాంటి ఇంధనాలు సూర్యరశ్మి తాకిడికి త్వరగా ఆవిరి అవుతుంటాయి. అన్ని లుబ్రికెంట్స్ కు ఉండే గుణమే వీటిలోనూ ఉండటం వల్ల మైలేజీపై ప్రభావం చూపి అది మందగిస్తుంది.

​బైక్ విడిభాగాలు మార్చొద్దు..

ఎంతో అవసరమైతే తప్ప బండి విడిభాగాలు, ఉపకరణాలు మార్చకూడదు. ఎందుకంటే వాహనం కొన్నప్పుడు ఒరిజినల్ ప్రొడక్ట్స్ ను ఇంజిన్ కు తగినట్లుగా అమర్చుతారు. కానీ చాలామంది స్టైల్ కోసం, కంఫర్ట్ కోసం బండి ఆకృతిని మార్చేందుకు ప్రయత్నిస్తుంటారు. దీని వల్ల కొన్నిసార్లు ఇంజిన్ ఎక్కువ ఇంధనాన్ని ఉపయోగించుకుంటుంది. ఆటోమెటిక్ గా మైలేజిపై ప్రభావం పడుతుంది.

పైన చెప్పిన ఈ విషయాలు తూచతప్పకుండా పాటిస్తే మీ బండి మైలేజి పెరగడమే కాదు.. ఇంజిన్ ఎక్కువ కాలం పనిచేస్తుంది.





Untitled Document
Advertisements