కరోనా కట్టడికి క్యూబా వండర్ డ్రగ్‌..త్వరలో స్వదేశానికి....

     Written by : smtv Desk | Sun, Mar 29, 2020, 02:13 PM

కరోనా కట్టడికి క్యూబా వండర్ డ్రగ్‌..త్వరలో స్వదేశానికి....

కరోనా వైరస్ మహమ్మారి బారినపడ్డ దేశాలు వైద్య సహాయం కోసం అర్ధిస్తున్నాయి. ఈ విజ్ఞప్తికి అగ్ర దేశాలు స్పందించకపోయినా.. క్యూబా మాత్రం ధైర్యంగా ముందుకొచ్చింది. కరోనా వైరస్ విజృంభిస్తోన్న ఐరోపాలోని ఇటలీ, స్పెయిన్‌ తదితర దేశాలకు తమ వైద్యబృందాల్ని పంపింది. కోవిడ్-19కు మూల కేంద్రమైన చైనాలోని వుహాన్‌కూ తమ వైద్యులను పంపిన క్యూబా.. యాంటీ వైరల్‌ చికిత్సలు, పెద్దఎత్తున మాస్కుల తయారీ ద్వారా కరోనా వైరస్‌ను ఎదుర్కొనడంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. కొన్ని దశాబ్దాల కిందట క్యూబాలో భయంకరమైన అంటువ్యాధి ప్రబలి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఆ దేశానికి వైద్య సాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో క్యూబా కమ్యూనిస్టు నేత ఫిడెల్‌ క్యాస్ట్రో కీలక నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే పెద్ద సంఖ్యలో డాక్టర్లను తయారుచేయాలని నిశ్చయించారు. దేశాన్ని డాక్టర్ల ఉత్పత్తి ఫ్యాక్టరీగా మలచిన ఆయన.. అన్ని రకాల అంటువ్యాధులకు పనిచేసే వండర్ డ్రగ్‌ను తయారుచేయించారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం కేరళలో కరోనా వైరస్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదుకావడంతో అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం కూడా క్యూబా వండర్ డ్రగ్‌ను దిగుమతి చేసుకునే ఆలోచనలో ఉంది. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ వెల్లడించారు. కేరళలో శుక్రవారం ఒక్క రోజే 39 కేసులు బయటపడటంతో అత్యవసరంగా క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటుచేసిన కేరళ సీఎం.. క్యూబా వండర్ డ్రగ్‌ను దిగుమతి చేసుకోడానికి ఆమోదం తెలిపారు. అన్నీ అనుకున్నట్టే జరిగితే క్యూబా ప్రభుత్వం ఈ డ్రగ్‌ను త్వరలోనే పంపుతుందని అంటున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం దీనికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. యాంటీవైరల్ ఇంటర్‌ఫెరాన్ అల్ఫా-2బి రీకాంబినెట్ డ్రగ్ దిగుమతి చేసుకోవాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని, దీనికి క్యూబా సమ్మతించినా కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియాను కూడా అనుమతి కోరినట్టు సీఎం పినరై విజయన్ వెల్లడించారు. కేరళ వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు కూడా దీనిని ధ్రువీకరించాయి. డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియాను అనుమతి కోరామని, విదేశాల నుంచి ఔషధాలు దిగుమతి చేసుకోవాలంటే అనుమతి తప్పనిసరి అన్ని పేర్కొన్నాయి. దీనిపై డీసీజీఐ సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నామని, ఇంటరాఫెరాన్ అల్ఫా- 2బీ అన్ని రకాల అంటువ్యాధులకు సమర్ధవంతంగా పనిచేస్తుందని నిరూపితమయ్యిందన్నారు. క్యూబాలోనూ, కేరళలోనూ కమ్యూనిస్ట్ ప్రభుత్వాలే ఉన్నాయి. గతంలోనూ కేరళ, క్యూబా కలిసి పనిచేసిన సందర్భాలున్నాయి. క్యూబా నిపుణులు కేరళలోని వైద్య, ప్రజారోగ్య సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. క్యూబా 40 ఏళ్ల క్రితమే యాంటీవైరల్ ఇంటర్‌ఫెరాన్ అల్ఫా-2బీని తయారుచేసింది. ఈ యాంటీ వైరల్ మందును కొన్ని రకాల కేన్సర్ రోగులకు కూడా వాడుతుంటార. కరోనాపైనా కూడా పవర్ ఫుల్‌గా పనిచేస్తుందని ఇటీవల నిరూపితమయ్యింది. చైనాలోని వుహాన్‌లో కరోనా మహమ్మారి వెలుగుచూసిన వెంటనే.. అక్కడికి డాక్టర్లను, ఈ వండర్ డ్రగ్‌ను అక్కడకు పంపింది. దీనివల్ల చాలా మంది రోగులకు వ్యాధి నయమైందని క్యూబా ప్రకటించింది. వైద్య సాయం అర్థించిన వెంటనే ఇటలీకి నిపుణులైన డాక్టర్లను పంపి.. రోగుల ప్రాణాలే ముఖ్యమన్న క్యాస్ట్రో మాటల్ని తూచ తప్పకుండా పాటించింది. ఇప్పుడు స్పెయిన్‌, నికరగవాకూ డాక్టర్లను పంపడానికి సిద్ధమయింది. క్యూబాలో ఇప్పటిదాకా 57 కరోనా కేసులే వెలుగుచూశాయి. ఒకరు మరణించారు. దేశంలోని పౌర, సైనిక ఆసుపత్రులు అన్నింటిలోనూ కరోనా రోగులకు చికిత్స అందించడానికి క్యూబా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.





Untitled Document
Advertisements