"వాడికి నాకు స్నేహంలో ఎప్పుడూ మార్పులేదు"

     Written by : smtv Desk | Sun, Mar 29, 2020, 04:13 PM


1978 నుంచి 2020 వరకూ హీరో భాను చందర్ తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. 80 నాటి హీరోల్లో ఇతనూ ఒకరు. మన ఊరి పాండవులు, ఆడవాళ్లు మీకు మా జోహార్లు, సత్యం శివం, గూడచారి నెం.1, తరంగిణి ఇలా వందకు పైగా చిత్రాల్లో నటించిన భానుచందర్.. ఇటీవల హిట్ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా మెప్పించారు. మెగాస్టార్ చిరంజీవికి మంచి మిత్రుడు. ఈ ఇద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఉండేదో వివరిస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. చిరంజీవి గారు నేను ఒకే రూంలో ఉండేవాళ్లం. మన ఊరి పాండవులు మూవీ షూటింగ్‌ టైంలో మేం ఒకే రూంలో ఉన్నాం. అసలు వాడే నాకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ డ్రైవ్ చేయడం నేర్పించాడు దోయకాయల పల్లిలో. రేయ్.. నీకు బైక్ తోలడం వచ్చా? అని అడిగాడు.. నాకు టూ వీలర్ రాదురా.. కారు తోలుతా అంటే.. ఛా!! రారా అని ఆ దగ్గర్లో ఎవరో రాజుగారో రెడ్డిగారో ఉండేవారు ఆయన బైక్ తీసుకుని నాకు డ్రైవింగ్ నేర్పించాడు. మేం ఇద్దరం చాలా సరదాసరదాగా ఉండేవాళ్లం. రాజమండ్రిలో షూటింగ్ చేస్తుంటే.. గంట గంటకు వర్షం వచ్చేది. ఆ టైంలో బాపు గారు పిలిచి.. భాను నువ్ కరాటే చేస్తావ్ అంట కదా.. చేయి అంటే చిరంజీవి, నేను స్లోమోషన్‌లో కరాటే చేసేవాళ్లం. మేం ఇద్దరం చాలా క్లోజ్. వాడికి నాకు స్నేహంలో ఎప్పుడూ మార్పులేదు. అప్పుడు ఏరా ఏరా అనుకున్నాం ఇప్పుడు ఏరా ఏరా అనుకుంటాం. వాడు చాలా సరదా మనిషి. దాన్ని గురించి చెప్పడం కంటే అనుభవిస్తే చాలా బాగుంటుంది. ప్రతి ఏడాది మేం అంతా కలుస్తూ ఉంటాం.. ఈ ఏడాది కూడా కలిశాం. నెక్స్ట్ ఇయర్ మేం అంతా కలిసి గోవా వెళ్లబోతున్నాం’ అంటూ చిరుతో ఉన్న అనుబంధాన్ని తెలియజేశారు భాను చందర్.





Untitled Document
Advertisements