కరోనా వైరస్ మొదటి పేషెంట్ ... ఆమె ఏమి చెప్పిందో తెలుసా ...

     Written by : smtv Desk | Sun, Mar 29, 2020, 04:43 PM

చైనాలో గత ఏడాది చివర్లో వెలుగుచూసిన అత్యంత ప్రమాదకర వైరస్ కరోనా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 199 దేశాలను హడలెత్తిస్తోంది. చైనాలోని వన్యప్రాణుల ద్వారా ఈ వైరస్ మానవులకు సంక్రమించినట్టు గుర్తించారు. కాగా, చైనాలో మొట్టమొదటి కరోనా బాధిత వ్యక్తి ఓ మహిళ. ఆమె ఆచూకీని వాల్ స్ట్రీట్ జర్నల్ మీడియా సంస్థ గుర్తించింది. ఆమె పేరు వుయ్ జుషాన్. వుహాన్ నగరంలోని సీ ఫుడ్ మార్కెట్లో జుషాన్ రొయ్యలు విక్రయిస్తుంటుంది. అయితే డిసెంబరు 10న జలుబు, జ్వరం, దగ్గుతో ఆమె ఆసుపత్రికి వెళ్లగా, సాధారణ జ్వరంగా భావించిన వైద్యులు కొద్దిపాటి ట్రీట్ మెంట్ తో ఇంటికి పంపించారు.

అయితే, క్రమేణా ఆమె పరిస్థితి క్షీణించడంతో వుహాన్ లోని ఓ మోస్తరు ఆసుపత్రికి తరలించారు. అక్కడా ఫలితం కనిపించలేదు. దాంతో జుషాన్ ను వుహాన్ యూనియన్ ఆసుపత్రిలో చేర్చారు. అప్పటికీ దాన్ని కరోనా వైరస్ గా గుర్తించలేదు. ఆ తర్వాత అదే మార్కెట్ కు చెందిన మరికొందరు సీ ఫుడ్ విక్రేతలు అవే లక్షణాలతో ఆసుపత్రికి వచ్చారు. చూస్తుండగానే ఇలాంటి లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య వందలు, వేలకు చేరింది. దాంతో పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న వుహాన్ యంత్రాంగం జుషాన్ తదితరులను క్వారంటైన్ చేసి ఇతర చర్యలకు ఉపక్రమించింది.

వైద్యపరీక్షల్లో అదో ప్రాణాంతక వైరస్ గా గుర్తించి కరోనా అని పేర్కొన్నారు. అటు, వుహాన్ లోని సీ ఫుడ్ మార్కెట్ ను మూసివేయించారు. తాను మార్కెట్ లోని ఓ టాయిలెట్ ను ఉపయోగించిన సందర్భంగా వైరస్ బారినపడినట్టు భావిస్తున్నానని జుషాన్ చెబుతోంది. కాగా, జుషాన్ నెలరోజుల చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జి అయింది. విషాదం ఏంటంటే, ఆ తర్వాత వైరస్ బారినపడినవారు వేల సంఖ్యలో మరణించారు. ఈ వైరస్ భూతం చైనా ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. ఇప్పుడు ప్రపంచదేశాలను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

కాగా, ఈ వైరస్ వ్యాప్తిపై జుషాన్ స్పందిస్తూ, చైనా ప్రభుత్వం మొదట్లోనే స్పందించి ఉంటే ఇన్ని మరణాలు సంభవించి ఉండేవి కావని అభిప్రాయపడింది. ఈ వైరస్ అలుగు (పంగోలిన్) వంటి చిన్న వన్యప్రాణి ద్వారా వ్యాపిస్తుందని పరిశోధకులు గుర్తించారు.





Untitled Document
Advertisements