ధోనిపై విమర్శలతో కోహ్లీ అలెర్ట్...విరాళం ఎంతో చెప్పని కెప్టెన్

     Written by : smtv Desk | Mon, Mar 30, 2020, 04:48 PM

ధోనిపై విమర్శలతో కోహ్లీ అలెర్ట్...విరాళం ఎంతో చెప్పని కెప్టెన్

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌ కరోనా వైరస్ కట్టడి కోసం ఇచ్చిన విరాళంపై వచ్చిన విమర్శలతో కెప్టెన్ విరాట్ కోహ్లీ అలర్ట్ అయ్యాడు. పీఎం- కేర్స్ ఫండ్, మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కి ఈరోజు విరాళం ప్రకటించిన కోహ్లీ దంపతులు.. అమౌంట్ మాత్రం బహిర్గతం చేయలేదు. ఇప్పటికే సహచర క్రికెటర్లు సురేశ్ రైనా రూ. 52 లక్షలు, సచిన్ టెండూల్కర్ రూ. 50 లక్షలు, అజింక్య రహానె రూ. 10 లక్షలు విరాళం ప్రకటించగా.. సౌరవ్ గంగూలీ రూ. 50 లక్షల విలువైన బియ్యాన్ని పేదలకి పంచుతున్నాడు. దేశంలో కరోనా వైరస్ కట్టడి కోసం కొన్ని ట్రస్ట్‌లు ముందుకు వచ్చి విరాళాలు సేకరిస్తున్నాయి. ఈ క్రమంలో మహేంద్రసింగ్ ధోనీ ఇటీవల పుణెలోని ఓ ఛారిటబుల్ ట్రస్ట్‌కి రూ. 1 లక్ష విరాళంగా ప్రకటించాడు. దీంతో ‘‘రూ. 800 కోట్ల ఆస్తులున్న నువ్వు.. కేవలం రూ. 1 లక్ష విరాళంగా ఇస్తావా..?’’ అంటూ ధోనీని నెటిజన్లు ఉతికారేశారు. దీంతో.. అతని భార్య సాక్షి తెరపైకి వచ్చి.. మీడియా తప్పుడు వార్తలు రాస్తోంది అని దుయ్యబట్టింది. కానీ.. ధోనీ ఎంత విరాళం ఇచ్చాడో మాత్రం చెప్పలేదు. మొత్తానికి ధోనీ రూ. 1 లక్ష విరాళం పెద్ద దుమారమే రేపింది. ధోనీపై వచ్చిన విమర్శల కారణం కాబోలు విరాట్ కోహ్లీ దంపతులు.. తాము ఎంత విరాళం ప్రకటించిన విషయాన్ని రహస్యంగా ఉంచారు. ‘‘అనుష్క, నేను.. పీఎం కేర్స్ ఫండ్, మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. కరోనా వైరస్‌తో చాలా మంది ఇబ్బందులు పడుతుండటాన్ని చూస్తుంటే మా హృదయాలు బద్దలవుతున్నాయి. కొంత మందికైనా మా సాయం కాస్త ఉపశమనం కలిగిస్తుందని ఆశిస్తున్నాం’’ అని విరాట్ కోహ్లీ వెల్లడించాడు.





Untitled Document
Advertisements