కరోనాతో పోరాటం: 50 మంది డాక్టర్లు మృతి

     Written by : smtv Desk | Mon, Mar 30, 2020, 05:18 PM

కరోనాతో పోరాటం: 50 మంది డాక్టర్లు మృతి

ప్రపంచంలో కరోనా మరణాల సంఖ్య 30 వేలు దాటింది. ఇప్పటిదాకా దాని బారిన పడి 33,523 మంది బలయ్యారు. 20 వేలకు పైగా మరణాలు ఒక్క యూరప్​లోనే నమోదయ్యాయి. కేసులు ఏడు లక్షలు దాటాయి. 7,07,312 మందికి వైరస్​ సోకింది. 1,50,732మంది ఇన్​ఫెక్షన్​ నుంచి కోలుకున్నారు. ఇటలీలో ఇప్పటికే కరోనా మరణాలు పది వేలు దాటిన సంగతి తెలిసిందే. కేసులు లక్షకు చేరువలో ఉన్నాయి. కరోనా పేషెంట్లకు ట్రీట్​మెంట్​ చేస్తున్న డాక్టర్లూ బలవుతున్నారు. ఇటలీలో ఇప్పటిదాకా 50 మంది డాక్టర్లు కరోనాతో చనిపోయినట్టు అక్కడి నేషనల్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఆర్డర్స్​ ఆఫ్​ సర్జన్స్​ అండ్​ డెంటిస్ట్స్​ ప్రెసిడెంట్​ ఫిలిపో అనేలి ప్రకటించారు. అందులో 17 మంది డాక్టర్లు ఎక్కువ ఎఫెక్ట్​ ఉన్న లొంబార్డి రీజియన్​కు చెందిన వారేనని చెప్పారు. వేడి వాతావరణం, ఫుట్​బాల్​ లీగ్​, ఇతర పెద్ద కార్యక్రమాల వల్లే స్పెయిన్​లో కేసులు ఎక్కువైపోయాయని అధికారులు వెల్లడించారు. అక్కడ ఒక్కరోజే 624 మంది చనిపోయారు. 78,799 కేసులు నమోదవగా, 6,606 మంది చనిపోయారు. నెదర్లాండ్స్​లో మరణాలు వేగంగా పెరుగుతున్నాయి. 10,866 కేసులకుగానూ 771 మంది చనిపోయారు. సౌత్​ఆఫ్రికా జొహెన్నస్​బర్గ్​లో సోషల్​ డిస్టెన్సింగ్​ పాటించని గుంపుపై పోలీసులు రబ్బర్​ బుల్లెట్లు ప్రయోగించారు. చైనాలో ఇంపోర్టెడ్​ కేసులు పెరిగిపోతున్నాయి. లోకల్​గా కొత్త కేసులు నమోదు కానప్పటికీ, వేరే దేశాల నుంచి వస్తున్న వాళ్లతో కేసుల సంఖ్య ఎక్కువవుతోంది. అయితే, వైరస్​కు మూలమైన వుహాన్​ సిటీలో లాక్​డౌన్​ ఎత్తేసింది చైనా. ప్రయాణ ఆంక్షలను సడలించింది. అయితే,ఈ టైంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్​ సోకిన తొలి బాధితులను చైనా అధికారులు గుర్తిస్తున్నారు. అందులో భాగంగా రొయ్యలు అమ్ముకుని బతికే 57 ఏళ్ల మహిళను ‘పేషెంట్​ జీరో’గా గుర్తించారు. కరోనా వైరస్​ కట్టడికి తీసుకుంటున్న చర్యలతో మానవ హక్కులు ప్రమాదంలో పడే ప్రమాదముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిడిల్​ ఈస్ట్​ సహా పలు దేశాల్లో ఇప్పటికే సైనిక వాహనాలు, పోలీసులు గస్తీ కాస్తుండడం, ఫోన్లతో నిఘా పెడుతుండడం వల్ల ప్రైవసీతో పాటు హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందంటున్నారు. ఆస్ట్రేలియాలో గృహ హింస కేసులు పెరిగిపోతున్నట్టు అధికారులు చెబుతున్నారు. న్యూసౌత్​వేల్స్​ రాష్ట్రంలో ఆ కేసులు 40 శాతం పెరిగాయని వుమెన్స్​ సేఫ్టీ అనే స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. విక్టోరియా స్టేట్​లోనూ కేసులు రెట్టింపయ్యాయని పోలీసులు తెలిపారు. ఇక, కరోనాతో ఫైట్​ చేసేందుకు 100 కోట్ల ఆస్ట్రేలియన్​ డాలర్లను ప్రభుత్వం విడుదల చేసింది. బంగ్లాదేశ్​లో ఆర్మీని రంగంలోకి దించుతున్నట్టు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 3,500 మంది సైనికులు వీధుల్లో పహారా కాస్తారని వెల్లడించింది. సంక్షోభ టైంలో జర్మనీ జనాలు క్రమశిక్షణతో ఉన్నారని, అందుకే మరణాల సంఖ్య తక్కువగా ఉందని జర్మనీ చాన్స్​లర్​ ఏంజెలా మెర్కెల్​ చెప్పారు. పాకిస్థాన్​లో కేసుల సంఖ్య 1,526కి పెరిగింది. 13 మంది చనిపోయారు. కరోనా వైరస్​ ఎఫెక్ట్​తో బ్రిటన్​ జూన్​ దాకా మూతపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అందరూ ఇళ్లకే పరిమితం కావాలని బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ ప్రజలకు లేఖ రాశారు.





Untitled Document
Advertisements