రెండు నెలల సుదీర్ఘ విరామం తరువాత థియేటర్స్ ఓపెన్

     Written by : smtv Desk | Tue, Mar 31, 2020, 12:44 PM

రెండు నెలల సుదీర్ఘ విరామం తరువాత థియేటర్స్ ఓపెన్

కరోనా ప్రభావంతో సినిమా ఇండస్ట్రీ కుదేలైంది. సినిమాలు విడుదల కాక.. షూటింగ్‌లు నిలిచిపోవడంతో వేలది మంది కళాకారులు, కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని సినీ కార్మికుల ఆకలి కేకలతో ఇండస్ట్రీ క్షీణదశలో ఉంది. సుమారు ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే రూ. 2000లకు పైగా నష్టం వాటిల్లిందని అంచనా. ఇక థియేటర్ యజమానులు అందులో పనిచేసే వాళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బొమ్మ పడితేనే వాళ్లకు బువ్వ.. కరోనా మహమ్మారి కాటు వేయడంతో వాళ్లకు కూడు లేకుండా పోయింది. దీంతో వాళ్లను ఆదుకునేందుకు ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి సాయం చేస్తూ సినీ కార్మికుల ఆకలి తీర్చుతున్నారు. ప్రభాస్, మహేష్ బాబు, చిరంజీవి, అల్లు అర్జున్ ఇలా స్టార్ హీరోలంతా పెద్ద మనసు చాటుకుంటూ సినిమా వర్కర్స్‌కి సాయం చేస్తూ విరాళాలు ప్రకటించారు.

ఇదిలా ఉంటే ఈ కరోనాను మోసుకువచ్చిన చైనా దేశంలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగౌతున్నాయి. అక్కడ ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న సినిమా ఇండస్ట్రీ‌కి కోలుకోలేని దెబ్బ తగిలింది. చాలా సినిమాలు విడుదలకు వాయిదా పడ్డాయి. దీంతో ఇప్పుడు పరిస్థితులు కాస్త మెరుగుకావడంతో తిరిగి థియేటర్స్ ప్రారంభం కాబోతున్నాయి. తగు జాగ్రత్తలు తీసుకుంటూ సిటింగ్‌లో మార్పులు చేస్తూ ప్రభుత్వ సూచనల పాటిస్తూ పక్క పక్కను కూర్చునేలా కాకుండా సిటింగ్‌లో కనీసం మూడు అడుగుడు దూరం పాటిస్తూ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

చైనాలోని షాంఘై నగరంలోని శనివారం నుంచి సుమారు 200 థియేటర్స్‌లో తిరిగి ఓపెన్ కానున్నాయి. అయితే కరోనాతో కళ తప్పిన థియేటర్స్‌కి తిరిగి ప్రేక్షకుడు చేరుకోవడం కాస్త టైం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి పాత సినిమాలనే వేస్తున్నారు. ఇటీవల విడుదలైన సినిమాలు కరోనా ఎఫెక్ట్‌తో రెండు మూడు రోజుల మాత్రమే ప్రదర్శితం అయ్యాయి. తిరిగి వాటిని రీ రిలీజ్ చేస్తున్నారు. త్వరలో పూర్తి స్థాయిలో థియేటర్స్ పునరుద్దరించి కొత్త సినిమాలను విడుదల చేసేందుకు చైనా ప్లాన్ చేస్తుంది.





Untitled Document
Advertisements