23 కోట్ల మంది వాహనదారులకు కేంద్రం శుభవార్త...

     Written by : smtv Desk | Tue, Mar 31, 2020, 01:29 PM

23 కోట్ల మంది వాహనదారులకు కేంద్రం శుభవార్త...

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రం విధించిన 21 రోజుల లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, ఇతర రవాణా పత్రాల కాలపరిమితిని జూన్‌ 30 వరకూ పొడగిస్తూ కేంద్ర రవాణా శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 23 కోట్ల మంది వాహన యజమానులు, 1.2 కోట్ల వాహనాలకు భారీ ఊరట లభించినట్టయ్యింది. లాక్‌డౌన్ కారణంగా లైసెన్సులు, పర్మిట్లు, ఇతర రవాణా పత్రాలను రెన్యువల్ చేయించుకోవడంలో పౌరులు ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తమ దృష్టికి వచ్చిందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ పేర్కొంది. మోటార్ వాహనాల చట్టం 1988, కేంద్ర మోటార్ వాహనాల నిబంధనలు 1989 ప్రకారం మార్చి 31తో గడువు ముగిసిపోయే డ్రైవింగ్ లైసెన్స్‌లు, స్టేట్ లేదా నేషనల్ పర్మిట్లు, వాహన ఫిట్‌నెస్ పరీక్షలను జూన్ 30వరకు పొడిగిస్తున్నట్టు స్పష్టం చేసింది. లాక్‌డౌన్ వెళ నిత్యావసర సరుకులు రవాణా చేస్తున్న వాహనాలకు సంబంధిత పత్రాలు లేకపోవడంతో పోలీసులు అడ్డుకుంటున్నట్టు నివేదికలు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ‘ఫిబ్రవరి 1, 2020 నాటికి గడువు ముగిసిన పత్రాలను జూన్ 30,2020 వరకు చెల్లుబాటు అయ్యేలా అమలు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు కేంద్రం సూచించింది. పన్ను చెల్లింపులు నిలిపివేయడానికి రవాణా వాహనాలకు నాన్-యూజ్ క్లాజ్ సౌకర్యం అనేక రాష్ట్రాల్లో ఉందని, ఈ సదుపాయాన్ని ఆన్‌లైన్‌లో ఎన్ఐసీ అందిస్తోంది. ట్యాక్సీ, బస్సు లాంటి వాణిజ్య వాహనాలకు ఉపశమనం కలిగించడానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాలు దీనిని అనుసరించవచ్చని’ ఉత్తర్వుల్లో పేర్కొంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న ఈ క్లిష్ట సమయంలో అవసరమైన సేవలను అందిస్తున్న ప్రజలు, రవాణాదారులు, వివిధ సంస్థలకు ఇబ్బంది లేకుండా చూడాలని కేంద్రాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అభ్యర్థించాయి.





Untitled Document
Advertisements