గంటకో ‘సెల్ఫీ’.. గడప దాటితే వీపు విమానం మోతే

     Written by : smtv Desk | Tue, Mar 31, 2020, 03:50 PM

గంటకో ‘సెల్ఫీ’.. గడప దాటితే వీపు విమానం మోతే

కరోనా వైరస్ కట్టడి కోసం ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కేంద్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికారులంతా కోవిడ్‌ను అరికట్టడం కోసం శ్రమిస్తున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం విదేశాలకు వెళ్లొచ్చిన వారిని రెండు వారాలపాటు క్వారంటైన్లో ఉండాలని ప్రభుత్వాలు ఆదేశించాయి. ఇంట్లో ఒక గదిలో ఉండాలని, ఎవర్నీ కలవొద్దని సూచించాయి. కరోనా అనుమానితులు, కరోనా రోగులు కలిసిన వారికి కూడా ఇదే తరహా ఆదేశాలను జారీ చేశారు. కానీ చాలా మంది హోం క్వారంటైన్లో ఉండకుండా ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు. చాలా మంది చేతుల మీద సిరా ముద్ర వేసినప్పటికీ వారు రోడ్ల మీద తిరుగుతూ పట్టుబడ్డారు. కానీ ప్రస్తుతం కోవిడ్ అనుమానితుల సంఖ్య ఒక్కో రాష్ట్రం దాదాపు 30 వేలకు చేరింది. ఇంత మందిపై నిఘా వేయడం ప్రభుత్వాలకు కష్టం అవుతోంది. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఓ వినూత్న విధానాన్ని ప్రారంభించింది. హోం క్వారంటైన్లో ఉన్నవారు ఇళ్లు వదిలి వెళ్లకుండా చూడటం కోసం కర్ణాటక రెవెన్యూ విభాగం ఓ మొబైల్ యాప్ రూపొందించింది. ఇక కరోనా పేషెంట్లు, అనుమానితులు తమ ఫోన్లలో ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని ప్రతి గంటకు ఓ సెల్ఫీ దిగి పంపాల్సి ఉంటుంది. లేదంటే వెంటనే అధికారులు అలెర్ట్ అయిపోతారు. వారిని తీసుకెళ్లి క్వారంటైన్ సెంటర్లలో పడేస్తారు. హోం క్వారంటైన్లో ఉన్నవారు మొబైల్ యాప్‌లో తమ వివరాలను నమోదు చేసి గంటకు ఒకటి చొప్పున సెల్ఫీ దిగి పంపాలని కర్ణాటక వైద్య విద్య మంత్రి సుధాకర్ కరోనా అనుమానితులకు సూచించారు. ఈ ఫొటో ఆధారంగా, జీపీఎస్ సాయంతో సదరు వ్యక్తి ఇంట్లోనే ఉన్నాడా లేదా బయటకు వెళ్లాడా అనేది నిర్ధారిస్తారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్య మినహాయింపునిస్తారు. మిగతా వేళల్లో సెల్ఫీ దిగి పంపకపోయినా, అతి తెలివితో ఏదో ఒక ఫొటో పంపినా.. ప్రభుత్వ ఆధ్వర్యంలోని క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తారు.





Untitled Document
Advertisements