మరో ప్రాణం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన బామ్మ

     Written by : smtv Desk | Wed, Apr 01, 2020, 06:41 PM

మరో ప్రాణం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన బామ్మ

శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడంతో ఆస్పత్రిలో చేరిన ఆ బామ్మకి కరోనా వైరస్ సోకిందన్న భయంకర నిజం తెలిసింది. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవడంతో ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే సరైన వైద్య సదుపాయాలు అందక.. అన్ని వైద్య పరికరాలు అందుబాటులో లేక ఎక్కువ మంది చనిపోతున్నారన్న విషయం ఆమెని కలచివేసింది. అలాంటి పరిస్థితుల్లో తన ప్రాణాలు పోయినా ఫర్వాలేదని నిర్ణయించుకున్న ఆమె.. త్యాగానికి సిద్ధపడింది. తృణప్రాయంగా తన ప్రాణాలు వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. హృదయాలను పిండేస్తున్న ఈ ఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది.

బ్రెజిల్‌కి చెందిన సుజానె హయ్‌లార్ట్స్ వయస్సు 90 ఏళ్లు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుండడంతో ఇటీవల ఆస్పత్రిలో చేరింది. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. అనంతరం ఆమెని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఐసోలేషన్‌లో ఉంచారు. అయితే కరోనా మరణాలు ఆమెని తీవ్రంగా కలచివేశాయి. వైరస్ బారిన పడి యువత చనిపోవడం ఎక్కువ బాధించి ఆమె కఠిన నిర్ణయం తీసుకుంది. వెంటిలేటర్ పెట్టేందుకు సిద్ధమైన డాక్టర్లకు కంటతడి పెట్టించింది. ‘ నేను చాలా మంచి జీవితం గడిపాను. నాకు వెంటిలేటర్ అవసరం లేదు. అది కరోనాతో బాధపడుతున్న యువతకు, ఉపయోగపడుతుంది. చిన్న వయస్సు వారిని బతికించండి’ అంటూ తోసిపుచ్చింది. అనంతరం రెండు రోజులకు సుజానె కన్నుమూయడం ప్రతి ఒక్కరి హృదయాలను బరువెక్కించింది. మరో ప్రాణం కాపాడడం కోసం తన ప్రాణాలు వదిలేసి ఆమె చేసిన త్యాగం కంటతడి పెట్టించింది. యూకే‌లో ఇప్పటికే కరోనా వైరస్ విరుచుకుపడుతోంది. బెల్జియంలో ఇప్పటికి 700కు పైగా మరణాలు నమోదయ్యాయి. సుమారు 12,775 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా, వెయ్యి మందికి పైగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు. యూకేలో 12, 13 ఏళ్ల వయసున్న టీనేజర్లు కరోనా వైరస్ కారణంగా మరణించారు.





Untitled Document
Advertisements