పాక్ కోసం విరాళం....యువీ, భజ్జీలపై తీవ్ర విమర్శలు

     Written by : smtv Desk | Thu, Apr 02, 2020, 11:05 AM

పాక్ కోసం విరాళం....యువీ, భజ్జీలపై తీవ్ర విమర్శలు

పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది ఫౌండేషన్‌కి విరాళాలు ఇవ్వాలని సూచించి విమర్శలు ఎదుర్కొన్న యువరాజ్ సింగ్ ఎట్టకేలకి స్పందించాడు. మానవత్వానికి బాసటగా నిలిచేందుకు తాను ప్రయత్నించాను తప్ప.. ఎవరినీ బాధ పెట్టే ఉద్దేశంతో ఆ ఫౌండేషన్‌కి విరాళాలు ఇవ్వాలని తాను చెప్పలేదని యువరాజ్ సింగ్ వివరణ ఇచ్చాడు. మరోవైపు యువీపై విమర్శలు రావడంతో అఫ్రిది కూడా స్పందించాడు. అభిమానులు సోషల్ మీడియాలో అతిగా స్పందించడంపై ఇద్దరు క్రికెటర్లు నొచ్చుకున్నారు. పాకిస్థాన్‌లో కరోనా వైరస్ కట్టడి కోసం అఫ్రిది ఫౌండేషన్ సాయం చేస్తూ.. పేదల ఆకలి తీరుస్తోంది. దీంతో.. ఆ ఫౌండేషన్‌పై ప్రశంసల వర్షం కురిపించిన యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్.. విరాళాలు కూడా ఇవ్వాలని అభిమానులకి సూచించారు. కానీ.. భారత్‌లో కరోనా వైరస్ కట్టడి కోసం ఇప్పటి వరకూ విరాళం ప్రకటించని ఈ ఇద్దరు క్రికెటర్లు.. అదీ పాక్ కోసం విరాళం ఇవ్వాలని సూచించడంపై అభిమానులు పెద్ద ఎత్తున మండిపడ్డారు. ‘‘పేదలకి అండగా నిలుస్తున్న ఫౌండేషన్‌కి సాయం చేయాలని నేను ఇచ్చిన పిలుపు ఈ తరహాలో వ్యతిరేకంగా ఎందుకు మారిందో నాకు అర్థం కావడం లేదు. మానవత్వానికి బాసటగా నిలవాలని ఆశించాను.. తప్ప.. ఎవరినీ బాధపెట్టే ఉద్దేశంతో నేను ఆ పిలుపు ఇవ్వలేదు. ఇక ఆఖరిగా నేను భారతీయుడ్ని. ఎప్పుడూ దేశం వైపే నిలబడతా’’ అని యువరాజ్ సింగ్ వివరణ ఇచ్చాడు.

యువీ, భజ్జీలపై వచ్చిన విమర్శల గురించి అఫ్రిది మాట్లాడుతూ ‘‘మానవత్వం గురించి యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ చేసిన చిన్న మెసేజ్‌ల్ని ఈ తరహాలో ప్రజలు తప్పుగా అర్థం చేసుకోవడం బాధించింది. మేమంతా ప్రేమ, శాంతికి ప్రచారకర్తలం. మా మద్దతుని ఇకపై కూడా కొనసాగిస్తాం’’ అని వెల్లడించాడు.





Untitled Document
Advertisements