"టీ20ల్లో రోహిత్, వార్నర్ బెస్ట్ ఓపెనర్స్"

     Written by : smtv Desk | Sat, Apr 04, 2020, 08:41 PM


టీ20 క్రికెట్‌లో రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ అత్యుత్తమ ఓపెనర్లని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌లో టామ్ మూడీ కోచ్‌గా వ్యవహరిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టీమ్‌కి డేవిడ్ వార్నర్ ఓపెనర్‌గా ఆడుతుండగా.. ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ ఇప్పటికే నాలుగు సార్లు ఆ జట్టుని విజేతగా నిలిపిన విషయం తెలిసిందే.


మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ కరోనా వైరస్ కారణంగా ఏప్రిల్ 15కి వాయిదా పడగా.. ఇప్పుడు టోర్నీ జరగడంపైనా సందిగ్ధత నెలకొంది. దీంతో.. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోనే ఇంటివద్ద ఉన్న టామ్ మూడీ.. సోషల్ మీడియా ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇస్తున్నాడు. ఈ క్రమంలో ‘‘టీ20 ఫార్మాట్‌లో బెస్ట్ ఓపెనర్స్ ఎవరు..?’’ అని ఒకరు ప్రశ్నించగా.. రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ అని టామ్ మూడీ సమాధానమిచ్చాడు. ఇక ఇండియాలో బెస్ట్ ఫీల్డర్ ఎవరనే ప్రశ్నకి రవీంద్ర జడేజా అని సమాధానమిచ్చిన టామ్ మూడీ.. ఫేవరెట్ క్రికెటర్‌గా విరాట్ కోహ్లీని ఎంచుకున్నాడు. కానీ.. అత్యుత్తమ కెప్టెన్‌గా మాత్రం మహేంద్రసింగ్ ధోనీకి ఓటేశాడు. 2017లోనే టీమిండియా పగ్గాలని ధోనీ వదిలేసిన విషయం తెలిసిందే.


భారత్ తరఫున ఇప్పటి వరకూ 108 టీ20 మ్యాచ్‌లాడిన రోహిత్ శర్మ 138.79 స్ట్రైక్‌రేట్‌తో ఏకంగా 2,773 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. ఇక ఆస్ట్రేలియా తరఫున 79 మ్యాచ్‌లాడిన వార్నర్ 140.48 స్ట్రైక్‌రేట్‌తో 2,207 పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకం, 17 అర్ధశతకాలు ఉన్నాయి.





Untitled Document
Advertisements