ఇళ్ళు కొనాలనుకునే వారికి శుభవార్త.. భారీగా దిగిరానున్న ధరలు!

     Written by : smtv Desk | Sat, Apr 04, 2020, 08:48 PM

ఇళ్ళు కొనాలనుకునే వారికి శుభవార్త.. భారీగా దిగిరానున్న ధరలు!

కరోనా వైరస్ వల్ల దేశం మొత్తం లాక్ డౌన్‌లోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు కంపెనీలు, వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం పడింది. రియల్ ఎస్టేట్ రంగంపై కూడా ఎఫెక్ట్ గట్టిగానే పడుతోంది. దీంతో రియల్ ఎస్టేట్ ధరలు భారీగా దిగొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దశాబ్ద కాలంలో ధరల తగ్గుదల ఈసారి ఎక్కువగా ఉండొచ్చనే అంచనాలున్నాయి. దేశవ్యాప్తంగా ప్రాపర్టీ ధరలు 10 నుంచి 20 శాతం తగ్గొచ్చని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ లియాసెస్ ఫోరస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పంకజ్ కపూర్ తెలిపారు. అలాగే స్థలం ధరలు కూడా 30 శాతం పతనం కావొచ్చని పేర్కొన్నారు. 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం నుంచి చూస్తే ఇలాంటి పరిస్థితులు మళ్లీ ఇప్పుడు కనిపించొచ్చని వివరించారు.


ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగంపై బ్యాంకింగ్ అండ్ లెండింగ్ సంక్షోభం వల్ల ప్రతికూల ప్రభావం పడింది. అయితే అప్పటి నుంచి అన్ని మార్కెట్లలోనూ ధరలు మాత్రం స్థిరంగానే ఉంటూ వస్తున్నాయి. అయితే ఏడాది కాలం నుంచి పరిస్థితులు మారిపోయాయి. ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం వల్ల లిక్విడిటీ సమస్యలు తలెత్తడం ఇందుకు కారణం. దీంతో ప్రాపర్టీ డెవలపర్స్, కొనుగోలుదారులపై ప్రభావం పడింది. రియల్ ఎస్టేట్ డెవలపర్లు ప్రాపర్టీ కొనుగోలుదారులకు డిస్కౌంట్లు అందించడం ప్రారంభించారు.

కరోనా వైరస్ వల్ల ఇప్పుడు ప్రాపర్టీ ధరలు మరింత తగ్గే అవకాశముంది. ఆన్‌లైన్ రియల్ ఎస్టేట్ పోర్టల్ ప్రాప్‌టైగర్ నివేదిక ప్రకారం చూస్తే.. దేశవ్యాప్తంగా 9 ప్రధాన రెసిడెన్షియల్ మార్కెట్లలో విక్రయం కాకుండా మిగిలిపోయిన ఇళ్ల యూనిట్ల విలువ ఏకంగా రూ.6 లక్షల కోట్లుగా ఉంది. దీనితోపాటు బ్యాంకులు కూడా రియల్ ఎస్టేట్ నుంచి మొండి బకాయిలు పెరగొచ్చని భయపడుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వల్ల ఇప్పటికే పలు డెవలపర్ల ప్రాఫిట్స్‌పై ప్రభావం పడటం ప్రారంభమైంది. రానున్న రోజుల్లో డెవలపర్లు లాభాల మాట మార్చిపోవాల్సి రావొచ్చు. ఇప్పుడు అందరూ క్యాష్ ఫ్లో కాపాడుకుంటూ మనుగడ సాగించడం ఎలా? అని ఆలోచిస్తున్నారని నారెడ్కో వైస్ ప్రెసిడెంట్ అశోక్ తెలిపారు. ఇకపోతే ఇంటి కొనుగోలుకు ఇదే సరైన సమయం అనుకోవచ్చు. హోమ్ లోన్స్ తక్కువ వడ్డీకే వస్తున్నాయి. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద లోన్ తీసుకుంటే సబ్సిడీ కూడా వస్తుంది.





Untitled Document
Advertisements