పండంటి మ‌గ బిడ్డ‌కు జన్మనిచ్చిన కరోనా సోకిన‌ మ‌హిళ‌

     Written by : smtv Desk | Sat, Apr 04, 2020, 08:57 PM

పండంటి మ‌గ బిడ్డ‌కు జన్మనిచ్చిన కరోనా సోకిన‌ మ‌హిళ‌

క‌రోనాతో బాధ‌ప‌డుతున్న మ‌హిళ‌కు ఢిల్లీ ఎయిమ్స్ ఆస్ప‌త్రిలో శుక్ర‌వారం రాత్రి ప్ర‌స‌వం జ‌రిగింది. ఆమె పండంటి మగ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. త‌న‌కు క‌రోనా ఉండ‌డంతో బిడ్డ‌కు ఏమైనా వైర‌స్ సోకుతుందేమోన‌ని ఆ మ‌హిళ ఆందోళ‌న చెందింది. అయితే చిన్నారికి క‌రోనా లేద‌ని డాక్ట‌ర్లు చెప్ప‌డంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవ‌దుల్లేవు.


నిన్న రాత్రి ప్ర‌స‌వం అయిన మ‌హిళ భ‌ర్త ఎయిమ్స్ లో రెసిడెంట్ డాక్ట‌ర్ గా ప‌నిచేస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఆయ‌న‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ఐసోలేష‌న్ వార్డులో చేరాడు. టెస్టుల్లో క‌రోనా పాజిటివ్ రావ‌డంతో నిండు గ‌ర్భిణిగా ఉన్న భార్య‌కు కూడా వైర‌స్ సోకిందేమోనన్న అనుమానంతో ఆస్ప‌త్రిలో చేర్పించారు. ఆమె కూడా క‌రోనా బారిన‌ప‌డిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు.


ఆ మ‌హిళ‌కు ప్ర‌స‌వ స‌మ‌యం ద‌గ్గ‌ర‌గా ఉండ‌డంతో స్పెషల్ కేర్ తీసుకున్నామ‌ని ఎయిమ్స్ మెడిక‌ల్ సూరింటెండెంట్ డాక్ట‌ర్ డీకే శ‌ర్మ చెప్పారు. ఐసోలేష‌న్ వార్డులోనే టెంప‌ర‌రీ ఆప‌రేష‌న్ థియేట‌ర్ సిద్ధం చేశామ‌ని తెలిపారు. వైద్యులు పీపీఈల‌తో పాటు అన్ని ర‌క్ష‌ణ ప‌రిక‌రాల‌ను ధ‌రించి సిజేరియ‌న్ ఆప‌రేష‌న్ చేశారన్నారు. డాక్ట‌ర్ నీర‌జా బ‌ట్లా ఆధ్వ‌ర్యంలో ప్ర‌స‌వం చేశార‌ని చెప్పారు. త‌ల్లీబిడ్డ ఇద్ద‌రు క్షేమంగా ఉన్నార‌ని చెప్పారు డాక్ట‌ర్ నీర‌జా బ‌ట్లా. కొద్ది రోజుల పాటు వారిద్ద‌రినీ అబ్జ‌ర్వేష‌న్ లో ఉంచుతామ‌ని, ఆ చిన్నారికి త‌ల్లి చ‌నుబాలు ఇవ్వొచ్చ‌ని, దీని ద్వారా వైర‌స్ సోకే ముప్పు ఏమాత్రం లేద‌ని చెప్పారామె.





Untitled Document
Advertisements