చైనాలో మరోసారి కరోనా కర్ఫ్యూ..

     Written by : smtv Desk | Sat, Apr 04, 2020, 09:03 PM

చైనాలో మరోసారి కరోనా కర్ఫ్యూ..

కరోనా వైరస్ చైనాలో మొదలయి వివిధ దేశాలకు వ్యాపించింది. చైనాలోని వూహన్ సిటీ మొత్తం అతలాకుతలం అయింది. అక్కడి నుంచి మెల్లగా చైనా మొత్తం వ్యాపించింది. ఈ వైరస్ బారిన పడి దాదాపు 3000 మందికి పైగా మరణించినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా ఈ వ్యాధి బారిన 80 వేలకు పైగానే అనారోగ్యం పాలయ్యారు. అయితే ఆ తర్వాత అనూహ్యంగా అక్కడ కరోనా కేసులు పూర్తిగా తగ్గాయి. చైనాలో తగ్గినా.. అక్కడి పాకిన కరోనా వివిధ దేశాలలోకి పాకి దాదాపు 54వేల మందిని పొట్టనబెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా 10 లక్షలకు పైగా ప్రజానీకం ఈ వైరస్ బారిన పడ్డారు. దాంతో దాదాపు అన్ని దేశాలు హై అలర్ట్ ప్రకటించాయి.

చైనాలో మొదట విజృభించి ఆ తర్వాత తగ్గిన కరోనా వైరస్.. ఇప్పుడు మళ్లీ అక్కడ కోరలుచాస్తుంది. మళ్లీ పాజిటివ్ కేసులు నమోదుకావడంతో పాటు.. మరణాలు కూడా సంభవిస్తున్నాయి. వైరస్ ప్రభావం తగ్గింది కదా అని చైనాలో మళ్లీ మార్కెట్లు యధావిధిగా తెరచారు. జనాలు కూడా రోడ్లపైకి తండోపతండాలుగా వస్తున్నారు. దాంతో కరోనా మరోసారి పడగవిప్పింది. మళ్లీ పాజిటివ్ కేసులు నమోదు కావడం ప్రారంభమయింది. దాంతో ఏం చేయాలో తోచక అక్కడి ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్ ప్రకటించింది. చైనాలోని పింగ్డింగ్‌షాన్ నగరానికి సమీపంలో ఉన్న జియా కౌంటీలో మంగళవారం నుంచి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. ఈ ప్రాంతంలో దాదాపు 6 లక్షల మంది నివసిస్తున్నారు. వారందరిని హోంక్వారంటైన్ లో ఉండాల్సిందిగా అధికారులు ప్రకటించారు.



అయితే చైనాలోని వూహాన్ లో మరణించిన వారి సంఖ్యను అక్కడి ప్రభుత్వం తప్పుగా చెప్పిందని అమెరికా ఆరోపిస్తుంది. ఆ ప్రభుత్వం చెప్పిన మరణాల సంఖ్య కంటే 16 రెట్లు అధికంగా ప్రజలు మరణించి ఉంటారని ప్రముఖ వార్తా సంస్థ వ్యాఖ్యానించింది.

అమెరికాలోని కరోనా వైరస్ రెస్పాన్స్ కోఆర్డినేటర్ డాక్టర్ డెబోరా బిర్క్స్ మాట్లాడుతూ.. ‘చైనా చెప్పిన అబద్దం వల్ల ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. వూహాన్ లో 20 మిలియన్ల వరకు మరియు హుబీలో 80 మిలియన్ల వరకు ప్రజలుంటారు. దాంతో అక్కడ కేసులు పెరిగే అవకాశం చాలా ఉంది. కానీ, చైనా మాత్రం 50 వేల మంది మాత్రమే కరోనా బారిన పడ్డట్లు చెబుతుంది. ఇది ఎంత మాత్రం నమ్మదగ్గ విషయం కాదు. అందువల్ల చైనా ఇచ్చిన డాటాలో నిజం లేదు. అంతమంది ప్రజలు ఉన్నప్పుడు.. చాలా ఎక్కువ సంఖ్యలో వ్యాధి బారిన పడతారు. కానీ, చైనా మాత్రం తక్కువ సంఖ్యలోనే వ్యాధిగ్రస్తులయ్యారని తప్పడు సమాచారం ఇచ్చింది’ అని అన్నారు.



నవంబర్ 17న చైనాలో కరోనా వ్యాప్తి చెందింది. అయితే దాని గురించి చైనా డిసెంబర్ 31, 2019 వరకు ఏ దేశాన్ని కూడా హెచ్చరించలేదు. అంతేకాకుండా.. ఈ వైరస్ ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి వ్యాప్తి చెందదని తప్పుగా పేర్కొంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు అబద్దం చెప్పింది. వూహన్ లోని మార్కెట్ కు రాని వ్యక్తులకు కూడా కరోనా సోకడంతో.. అప్పుడు చైనా కరోనా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వచ్చే అవకాశముందని జనవరి 21న ప్రపంచాన్ని హెచ్చరించింది. కానీ, అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. కరోనా వివిధ దేశాలలో పాకి.. ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది.





Untitled Document
Advertisements