లైట్లన్నీ ఆపేస్తే పవర్ గ్రిడ్ కుప్పకూలుతుందా?

     Written by : smtv Desk | Sun, Apr 05, 2020, 04:19 PM

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ప్రజలంతా విద్యుత్ లైట్లను ఆపేస్తే పవర్ గ్రిడ్‌పై లోడ్ పెరిగిపోయి అది కుప్పకూలుతుందని వాదనలు సామాజిక మాధ్యమాల్లో బాగా వ్యాప్తి చెందుతున్నాయి. శుక్రవారం ఉదయం ప్రధాని వీడియో సందేశం పూర్తయిన కాసేపటికే ఇలాంటి వదంతులు వందల సంఖ్యలో పుట్టుకొచ్చాయి. అంతేకాక, అవి అత్యంత వేగంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిపోయాయి. అసలు నిజాలు తెలియని చాలా మంది వాటిని నిజం అనుకొని గ్రూపుల్లో ఫార్వర్డ్‌లు చేస్తున్నారు. కొందరు నాయకులు కూడా మోదీ పిలుపును వ్యతిరేకించారు. దీనిపై పునరాలోచన చేయాలని మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి డాక్టర్ నితిన్ రావత్ కూడా వ్యాఖ్యానించారు. అన్ని లైట్లు స్విచ్ ఆఫ్ చేస్తే, లోడ్ పెరిగిపోయి అది గ్రిడ్ వైఫల్యానికి దారితీస్తుందని, తద్వారా అత్యవసర సేవలు నిలిచిపోతాయని ఆయన అన్నారు. అయితే, తాజాగా ఈ వదంతులపై తెలంగాణ ట్రాన్స్‌కో జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు వివరణ ఇచ్చారు.


లాక్ డౌన్ కారణంగా, ఫ్యాక్టరీ యూనిట్లు ఇప్పటికే మూతపడ్డాయని దీనివల్ల మహారాష్ట్రలో విద్యుత్ డిమాండ్ ఇప్పటికే 23 వేల మెగావాట్ల నుంచి 13 వేల మెగావాట్లకు తగ్గిందని ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి అన్నారు. ఇక ప్రజలందరూ ఒకేసారి లైట్లను ఆపేస్తే సరఫరాలో భారీ వ్యత్యాసంతో విద్యుత్తు గ్రిడ్ కుప్పకూలిపోవచ్చని మంత్రి రావత్ చెప్పారు. అంతేకాదు తిరిగిసేవలను పునరుద్ధరించడానికి 12 నుంచి 16 గంటలు పట్టే అవకాశం ఉంటుందని అన్నారు. కరోనా ప్రబలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్తు అత్యంత ముఖ్యమైన అవసరమని ఆయన పేర్కొన్నారు.




మరోవైపు, మోదీ పిలుపుపై స్పందించిన మహారాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జితేంద్ర.. ఇదొక మూర్ఖత్వపు సూచనగా కొట్టి పారేశారు. కాంగ్రెస్ నేత శశిథరూర్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రధానికి భవిష్యత్తుపైగానీ, లాక్ డౌన్ తర్వాత పరిస్థితులను ఎలా అంచనా వేయాలో తెలీదని, ఈ విషయంలో మోదీకి ఒక ‘విజన్’ అంటూ ఏం లేదని ఆయన ట్వీట్ చేశారు. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పడిపోతుందని, మళ్లీ 9.09 నిమిషాల నుంచి ఒక్క ఉదుటున విద్యుత్ డిమాండ్ తార స్థాయికి చేరుతుందని ట్వీట్ చేశారు. ఈ విషయం ప్రధాని పరిశీలనలోకి రాలేదా అని ప్రశ్నించారు.




అయితే, ఇదే విషయంపై తెలంగాణ విద్యుత్తు ఇంజనీర్లు సైతం ఆందోళన వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఆకస్మికంగా అందరూ స్విచ్ ఆఫ్ చేస్తే తెలంగాణ గ్రిడ్ కూడా కూలిపోయే ప్రమాదముందని అధికారులు అన్నట్లుగా కొన్ని వార్తా సంస్థలు రాశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పవర్ గ్రిడ్‌పై పడే ప్రభావం గురించి జెన్ కో ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు వివరణ ఇచ్చారు. ఆదివారం ఒకేసారి లైట్లు ఆర్పేయడం వల్ల తెలంగాణ పవర్‌గ్రిడ్‌పై ఎలాంటి ప్రభావం పడబోదని ఆయన చెప్పారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ గ్రిడ్‌కు ఎలాంటి సమస్య రాకుండా అప్రమత్తంగా ఉన్నామన్నారు.


లైట్లు ఆర్పేస్తే గ్రిడ్‌ కుప్పకూలుతుందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రభాకర్ రావు కొట్టి పారేశారు. పవర్ గ్రిడ్‌పైన లోడ్ పడే మాట వాస్తవమేనని, అయితే, ఏ సమస్యా రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. పవర్‌ గ్రిడ్‌కు ఏ సమస్య రాకుండా అప్రమత్తంగా ఉన్నామని ఆయన చెప్పారు. కరోనా కట్టడికి ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును ప్రజలంతా విజయవంతం చేయాలని ప్రభాకర్ రావు సూచించారు. కరోనాపై భారత్ విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.



‘‘మనకు లైట్ల లోడ్ 700 మెగా వాట్స్ వరకూ ఉంటుంది. మొత్తం లోడ్ కరోనా వైరస్ వచ్చాక 9 వేల మెగా వాట్స్ నుంచి 10 వేల మెగా వాట్లకు పెరిగింది. కానీ, ఈ పరిస్థితులను ఊహించి మనం ముందే 13,500 మెగా వాట్లకు సిద్ధం చేశాం. అంతేకాదు, గత వారం రోజుల నుంచి 9 వేల నుంచి 9,500 మెగా వాట్ల విద్యుత్ మాత్రమే వినియోగంలో ఉంది. ఇప్పుడు మనం లైట్లు అఫ్ చేయడం వల్ల 7 వందల నుంచి 750 మెగా వాట్ల విద్యుత్ లోడ్ మాత్రమే తగ్గుతుంది. నిరంతరం విద్యుత్ సరఫరా చేయవచ్చు. గ్రిడ్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు.’’


‘‘ఈ మధ్యలో సూర్యగ్రహణం వచ్చినప్పుడు కూడా ఇలానే లైట్స్ ఆపడం జరిగింది. ఆ సమయంలో 800 మెగా వాట్స్ వినియోగం ఉండేది. అదికూడా ఆపడం వలన గ్రిడ్‌కు ఎలాంటి ఇబ్బంది రాలేదు. చాలా సమర్థవంతంగా మనం ఎదుర్కొన్నాం. గ్రిడ్ సేఫ్టీ చాలా బాగా ఉంది. ప్రజలు ఇలాంటి వదంతులు నమ్మవద్దు. లైటింగ్ మాత్రమే ఆపేసి, ఫ్రిడ్జ్, ఫ్యాన్లు, ఏసీలు వాడుకోండి. మనకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా ఉంది. అవసరమైతే దాని ద్వారా పంపులు ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడి విద్యుత్‌ను అక్కడ వాడుకోవచ్చు. ఇంకా అవసరమైతే శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ రివర్స్ పంపింగ్‌ను ఆన్ చేస్తాం. దీంతో లోడింగ్ బ్యాలెన్స్ అవుతుంది. మన రాష్ట్రంలో చాలా అధునాతన టెక్నాలజీని వాడుతున్నాం.’’ అని సీఎండీ అన్నారు.


ఏప్రిల్‌ 5 ఆదివారం రాత్రి 9 గంటలకు అందరూ ఇళ్లలో అన్ని లైట్లు బంద్ చేసి, కేవలం దీపాలు, కొవ్వొత్తులు, టార్చిలైట్లు, మొబైల్‌లలో ఫ్లాష్‌ లైట్లు ఆన్ చేయాలని ప్రధాని సూచించిన సంగతి తెలిసిందే. తొమ్మిది నిమిషాల సేపు వెలిగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇళ్లలో లైట్లు ఆపేయాలన్న ప్రధాని మోదీ పిలుపునకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మద్దతు పలికారు. కరోనాపై పోరుకు సంఘీభావంగా అందరూ ఐక్యతను చాటేలా దీపాలు వెలిగించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో విజయవంతం చేయాలని.. కరోనాపై భారతావని చేస్తున్న గొప్ప పోరాటం విజయవంతం సాగాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు.





Untitled Document
Advertisements