బాలయ్యతో మరో మూవీ....

     Written by : smtv Desk | Sun, Apr 05, 2020, 04:52 PM

బాలయ్యతో మరో మూవీ....

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన విజయ్ దేవరకొండ హీరోగా ఒక యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను సుమారు 50 శాతం పూర్తిచేసినట్టు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. తొలి షెడ్యూల్ అంతా ముంబైలోనే జరిగింది. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌ ఆగిపోవడంతో చిత్ర బృందమంతా ఇళ్లలోనే ఉంది. ఇదిలా ఉంటే, ఈ సినిమా తరవాత పూరి జగన్నాథ్.. నందమూరి బాలకృష్ణతో ఒక చిత్రం చేయబోతున్నారని ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘పైసా వసూల్’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘పైసా వసూల్’ సినిమా ఆ అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. దీంతో ఈసారి ఎలాగైనా బాలయ్యకు బ్లాక్ బస్టర్ ఇవ్వాలని పూరి నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం క్వారంటైన్ పీరియడ్‌లో ఉన్న పూరి.. బాలయ్య కోసం ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది. అంతా సక్రమంగా జరిగితే వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని సమాచారం. ప్రస్తుతం బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాల తర్వాత బోయపాటి, బాలయ్య కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక పూరి జగన్నాథ్ విషయానికి వస్తే.. విజయ దేవరకొండ సినిమాతో ఆయన బిజీగా ఉన్నారు. దీన్ని పాన్-ఇండియా మూవీగా తీర్చిదిద్దుతున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘లైగర్’, ‘ఫైటర్’ అనే టైటిళ్లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఆఖరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Untitled Document
Advertisements