9 గంట‌ల‌కు దీపాలు: ఈ జాగ్ర‌త్త‌లు పాటించ‌కుంటే పెద్ద ముప్పు!

     Written by : smtv Desk | Sun, Apr 05, 2020, 07:06 PM

9 గంట‌ల‌కు దీపాలు: ఈ జాగ్ర‌త్త‌లు పాటించ‌కుంటే పెద్ద ముప్పు!

క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటంలో దేశమంతా ఒక్క‌టిగా ఉంద‌ని చాటుతూ.. ఆదివారం రాత్రి 9 గంట‌ల‌కు 9 నిమిషాల పాటు దీపాలు/కొవ్వొత్తి వెలిగించాల‌ని పిలుపునిచ్చారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికుల‌కు సంఘీభావంగా ఇళ్ల‌లో లైట్లు ఆర్పేసి.. అంద‌రూ దీపాలు లేదా మొబైల్ ఫ్లాష్ లైట్ అయినా వెలిగించాల‌ని కోరారు. దీంతో ప‌లు రాష్ట్రాల సీఎంలు కూడా ప్ర‌ధాని మోడీ పిలుపును ఆచ‌రించాల్సిందిగా ప్ర‌జ‌ల‌కు సూచించారు. అయితే దీపాల‌ను వెలిగించే వారు కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించ‌కుంటే పెద్ద ప్ర‌మాదం కొని తెచ్చుకున్న‌ట్లు అవుతుంది. అవేంటో చూద్దాం.. దీపాలు వెలిగించే ముందు ఎవ‌రూ చేతుల‌కు శానిటైజ‌ర్ రాసుకోవ‌ద్దు. ఆల్క‌హాల్ శానిటైజ‌ర్లకు చాలా వేగంగా అంటుకునే ల‌క్ష‌ణం ఉంటుంది. శానిటైజ‌ర్లు చేతికి రాసుకుంటే దీపం వెలిగించేట‌ప్పుడు చేతుల‌కు మంట‌లు అంటుకునే ప్ర‌మాదం ఉంది. ఇటీవ‌ల కొన్ని ప్రాంతాల్లో చేతికి శానిటైజ‌ర్ రాసుకుని గ్యాస్ స్ట‌వ్ ద‌గ్గ‌ర‌కు వెళ్లడం వ‌ల్ల మంట‌లు అంటుకున్న ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. సో, దీపాలు వెలిగించేట‌ప్పుడు జాగ్ర‌త్త‌లు పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి. అవ‌స‌ర‌మైతే స‌బ్బుతో చేతులు క‌డుక్కోవ‌డం మంచిది. దీపాలు వెలిగించి బాల్క‌నీ లేదా ఇంటి వాకిలి ద‌గ్గ‌ర నిల్చోవాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అయితే త‌ప్ప‌కుండా సోష‌ల్ డిస్టెన్స్ అనే ల‌క్ష్మ‌ణ రేఖను మ‌ర్చిపోవ‌ద్ద‌ని ఆయ‌న సూచించారు. ఒకే ఇంట్లో ఉన్న వాళ్లైనా కూడా ఒక‌రికొక‌రు దూరం పాటించ‌డం ముఖ్యం. ల‌క్ష‌ణాలు లేకుండా కూడా కొంద‌రిలో క‌రోనా వైర‌స్ దాగి ఉండొచ్చు. క‌నీసం మీట‌రు దూరం పాటించ‌కుంటే ఒక‌రి నుంచి మ‌రొక‌రికి వైర‌స్ సోకే ప్ర‌మాదం ఉంది. దీపాలు వెలిగించేట‌ప్పుడు చిన్న పిల్ల‌ల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి. పొర‌బాటున పిల్ల‌లు ఆ దీపాల‌ను ప‌ట్టుకోకుండా చూసుకోవాలి. వాళ్ల‌ను దూరంగా ఉంచ‌డం ద్వారా లేనిపోని ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డాలి. రాత్రి 9 గంట‌ల‌కు లైట్లు మాత్ర‌మే ఆర్పాలని ప్ర‌ధాని మోడీ పిలుపునిచ్చారు. విద్యుత్ లోడ్ లో భారీ వేరియేష‌న్ వ‌స్తే గ్రిడ్ ఫెయిల్ అయ్యే ప్ర‌మాదం ఉంద‌ని వార్త‌లు రావ‌డంతో దీనిపై కేంద్ర ఇంధ‌న శాఖ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ప్ర‌ధాని పిలుపుతో గ్రిడ్ కు ప్ర‌మాదం ఏమీ ఉండ‌ద‌ని తెలిపింది. స్ట్రీట్ లైట్లు, ఎసెన్సీయ‌ల్ సర్వీసుల‌కు సంబంధించిన ఆఫీసులు, ఆస్ప‌త్రుల్లో విద్యుత్ వినియోగంలో ఏమాత్రం మార్పు ఉండ‌ద‌ని తెలిపింది. అయితే ప్ర‌జ‌లు లైట్లు మాత్ర‌మే ఆర్పాల‌ని, ఫ్యాన్లు, రిఫ్రిజ‌రేట్ల‌రు వంటి ఇత‌ర వ‌స్తువ‌లను ఆన్ లోనే ఉంచ‌డం మంచిది. అపార్ట్ మెంట్ల‌లో మొత్తంగా ఫ్యూజ్ లు తీసేయ‌కుండా ఎవ‌రి ఇళ్ల‌లో వాళ్లు లైట్లు ఆర్ప‌డం మేలు.





Untitled Document
Advertisements