డాక్టర్లకు , నర్సులకు సోకిన కరోనా .. ఆ ఆసుపత్రి మూసివేత

     Written by : smtv Desk | Mon, Apr 06, 2020, 04:13 PM

ముంబైలోని వోకార్డ్‌ ఆసుపత్రిలో 26 మంది నర్సులు, ముగ్గురు వైద్యులకు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ఆ ఆసుపత్రిలో ఇంతగా కరోనా వ్యాప్తి చెందడానికి గల కారణాలపై విచారణకు ఆదేశించారు.

ఆ ఆసుపత్రిలోకి ప్రవేశం, అలాగే ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లడాన్ని నిషేధించారు. ఇప్పటికే ఉన్న రోగులు కూడా బయటకు వెళ్లడాన్ని నిషేధించారు. ఆసుపత్రిలోని రోగులందరికీ రెండు సార్లు కరోనా నెగిటివ్‌ అని నిర్ధారణ అయ్యే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి.

ఆ ఆసుపత్రిలో 270 మంది రోగులు, నర్సులను పరీక్షిస్తున్నారు. ఓపీతో పాటు ఎమర్జెన్సీ సేవలనూ నిలిపి వేశారు. ఆసుపత్రిలోని క్యాంటీన్‌ ద్వారానే అందులోని పేషెంట్లు, నర్సులకు ఆహారం అందుతుంది. కరోనా నిర్ధారణ, నిబంధనల విషయంలో నిన్న కేంద్ర ప్రభుత్వం విస్తృతమైన మార్గ దర్శకాలను జారీ చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో ఇప్పటివరకు నమోదైన 745 కేసుల్లో 458 కేసులు ముంబైలోనే ఉన్నాయి. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు.

Untitled Document
Advertisements