అమెరికా పరిస్థితే మనకు వస్తే?

     Written by : smtv Desk | Mon, Apr 06, 2020, 08:19 PM

భారత్ లో కరోనా ప్రాబల్యం పెరుగుతున్న దశలో కేంద్రం, ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా తాము నిర్ణయాలు తీసుకున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. మన దేశ జనాభాను పరిగణనలోకి తీసుకుంటే కరోనా బాధితుల సంఖ్య చాలా తక్కువ అనే చెప్పుకోవాలని, ఇప్పటివరకు ఉన్న అధికారిక లెక్కల ప్రకారం కరోనా సోకినవారి సంఖ్య 4,314 అని, మృతుల సంఖ్య 122 అని వెల్లడించారు. ఇతర దేశాలతో పోల్చితే మన దేశం పరిస్థితి కాస్త మెరుగు అని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

అంతర్జాతీయ మీడియా సైతం భారత్ ను కొనియాడుతోందని, అనేక రాష్ట్రాలు, అనేక ప్రభుత్వాలు ఉన్నా భారత్ ఒక్కతాటిపై నిలిచిందని పాశ్చాత్య మీడియా సంస్థలు కొనియాడాయని తెలిపారు.

"ఇవాళ అమెరికా వంటి దేశమే అల్లాడిపోతోంది. అమెరికా ఆర్థిక రాజధానిగా పేర్కొనే న్యూయార్క్ లో శవాల గుట్టలు పడి ఉన్నాయి. అక్కడి సంగతులు వింటుంటే భయంకరంగా అనిపిస్తోంది. అమెరికా పరిస్థితి ఎంతో హృదయవిదారకంగా ఉంది. అలాంటి పరిస్థితి మరే దేశానికీ రాకూడదని అనిపిస్తోంది. శవాలను ట్రక్కుల్లో పంపిస్తున్నారు. వాటిని ఏంచేస్తున్నారో తెలియదు. అన్ని విధాలా అత్యంత శక్తిమంతమైన దేశం కూడా ఇవాళ నిస్సహాయ స్థితిలో చిక్కుకుపోయింది. అమెరికా పరిస్థితే మనకు వస్తే కోట్లమంది చచ్చిపోయేవాళ్లు. కానీ మనం చాలావరకు భద్రంగా ఉన్నామనే చెప్పాలి" అంటూ వ్యాఖ్యానించారు.

Untitled Document
Advertisements