"ఆ భారత క్రికెటర్ వికెట్ తీయడం అంటే చాలా ఇష్టం"

     Written by : smtv Desk | Tue, May 26, 2020, 11:38 AM


భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్‌ తీయడాన్ని తాను బాగా ఆస్వాదిస్తానని పాకిస్థాన్ అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ వెల్లడించాడు. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ వికెట్లను ఆరంభంలోనే పడగొట్టిన మహ్మద్ అమీర్.. నిమిషాల వ్యవధిలోనే మ్యాచ్‌ని పాక్‌వైపు తిప్పేశాడు. కానీ.. 2019 వన్డే ప్రపంచకప్‌లో అమీర్‌కి రోహిత్ శర్మ ఆ అవకాశం ఇవ్వలేదు. ఆ మ్యాచ్‌లో 113 బంతుల్లోనే 14x4, 3x6 సాయంతో ఏకంగా 140 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. అమీర్‌‌ని ఉతికారేశాడు. కానీ.. విరాట్ కోహ్లీ మాత్రం 77 పరుగుల వద్ద అమీర్ బౌలింగ్‌లోనే ఔటైపోయాడు. పాకిస్థాన్ జర్నలిస్ట్‌ సాజ్ సాధిక్ తాజాగా మహ్మద్ అమీర్‌కి ఓ ప్రశ్న సంధించాడు. ‘‘ఏ బ్యాట్స్‌మెన్‌ని నువ్వు ఔట్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతావు..?’’ అని ప్రశ్నించగా.. ‘‘చాలా మంది ఉన్నారు. కానీ.. నేను ఎక్కువ ఆసక్తి చూపే బ్యాట్స్‌మెన్ మాత్రం రోహిత్ శర్మ’’ అని మహ్మద్ అమీర్ సమాధానమిచ్చాడు. 28 ఏళ్ల అమీర్.. గత ఏడాది టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కెరీర్ బెస్ట్ ప్రదర్శన కనబర్చే వయసులో టెస్టులకి వీడ్కోలు చెప్పడం స్వార్థమవుతుందని పాక్ మాజీ క్రికెటర్లు మండిపడ్డారు. వాస్తవానికి 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌కి ముందు రోహిత్ శర్మ, మహ్మద్ అమీర్ మధ్య మాటల యుద్ధం నడించింది. అమీర్ ఓ సాధారణ బౌలర్ అని రోహిత్ శర్మ ఎద్దేవా చేయగా.. రోహిత్ శర్మ ఓ అసాధారణ బ్యాట్స్‌మెన్ అని అమీర్ అభివర్ణించాడు.






Untitled Document
Advertisements