తప్పిన పెను ప్రమాదం...ఎయిర్‌ ఏషియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్!!

     Written by : smtv Desk | Tue, May 26, 2020, 07:15 PM

తప్పిన పెను ప్రమాదం...ఎయిర్‌ ఏషియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్!!

ఎయిర్ ఏషియాకు చెందిన విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. జైపూర్‌ నుంచి హైదరాబాద్‌ వస్తున్న విమానానికి ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో 76 మంది ప్రయాణికులు ఉన్నారు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. పైలట్ ఏటీసీ ద్వారా అధికారులను అప్రమత్తం చేయడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇతర సేవలన్నింటినీ నిలిపివేసి సదరు విమానం సురక్షితంగా ల్యాండింగ్ అయ్యేంత వరకు ఎమర్జెన్సీ సేవలను అప్రమత్తం చేశారు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం (మే 26) మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. జైపూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎయిర్ ఏషియాకు చెందిన ఎ-320 విమానానికి చెందిన‌ ఒక ఇంజిన్‌లో ఫ్యూయల్‌ లీకేజీని పైలట్ ముందుగానే గుర్తించారు. ముందు జాగ్రత్త చర్యగా ఆ ఇంజిన్‌ను నిలిపివేసి.. ఒకే ఇంజిన్‌పై ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. ఎ-320 విమానంలో సాంకేతిక లోపంపై స్పందించిన ఎయర్ ఏషియా.. పైలట్ నేర్పుగా వ్యవహరించడంతో విమానం సురక్షితంగా గమ్యం చేరిందని తెలిపింది. ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తిన అంశంపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు సహకరిస్తామని తెలిపింది. ప్రయాణికుల భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. సుశిక్షితులైన తమ పైలట్లు ఇలాంటి పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోగలరని పేర్కొంది. పాకిస్థాన్‌లో గత శుక్రవారం ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం రేగింది. శంషాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ విధించడం చాలా అరుదైన సందర్భమని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి.







Untitled Document
Advertisements