తెలుగు రాష్ట్రాలపైకి రాకాసి మిడతల దాడి?!

     Written by : smtv Desk | Tue, May 26, 2020, 07:17 PM

తెలుగు రాష్ట్రాలపైకి రాకాసి మిడతల దాడి?!

ఈ మిడతల దండును ఆపలేకపోతే సుమారు రూ.8 వేల కోట్ల విలువైన పంటకు నష్టం వాటిల్లుతుందని మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యవసాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. కేవలం పంటలనే కాక కూరగాయలు, పండ్ల తోటలు, నర్సరీలు, పత్తి, మిరప పంటలను మిడతలు నాశనం చేస్తాయని భావిస్తున్నారు. మరోవైపు, ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో కూడా మిడతల తాకిడి ఎక్కువగా ఉండటంతో రసాయనాల పిచికారికి సిద్ధం చేశారు. ఈ మేరకు అగ్ని మాపక సిబ్బందిని అప్రమత్తం చేశారు. వీటి నియంత్రణ కోసం రాజస్థాన్‌ నుంచి ప్రత్యేక బృందాలను పిలిపిస్తున్నారు.

ఇథియోపియా, సోమాలియా లాంటి తూర్పు ఆఫ్రికా దేశాల నుంచి ఈ కోట్లాది సమూహాల మిడతల దండు సముద్రాన్ని దాటి వచ్చాయని నిపుణులు చెబుతున్నారు. భారత్ కంటే ముందే అవి పాకిస్థాన్‌పై విరుచుకు పడ్డాయి. దీంతో మిడతలపై పోరాటానికి ఫిబ్రవరిలో అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించారు. అక్కడ మొత్తం ఊడ్చేసిన మిడతలు ఇప్పుడు భారత్‌లో దండయాత్ర ప్రారంభించాయి. రాజస్థాన్, పంజాబ్, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ మిడతలు పంటలకు నష్టాన్ని కలిగిస్తున్నాయి.


ప్రభావిత ప్రాంతాల్లో కోట్లలో దూసుకొచ్చే మిడతల దండును ఎలా వదిలించుకోవాలో రైతులకు అర్థం కావట్లేదు. ఏం పాలుపోక లబోదిబో మంటున్నారు. తమను ప్రభుత్వాలే ఆదుకోవాలని, తమ పంటల్ని తినకుండా ఏవైనా చర్చలు చేపట్టాలని వేడుకుంటున్నారు. అయితే, ఇప్పటికే ఐదు రాష్ట్రాలను తాకిన ఈ మిడతల దండు తర్వాత తెలుగు రాష్ట్రాల్లోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే రాజస్థాన్‌లోని 18 జిల్లాలు, మధ్యప్రదేశ్‌లో 12 జిల్లాల్లో పంటలు ఇప్పటికే నష్టపోయాయి. రాజస్థాన్, గుజరాత్, హరియాణాల్లో 2.05 లక్షల చదరపు కిలోమీటర్ల మేర మిడతలు దాడి చేసినట్లు అంచనా. రాజస్థాన్‌లో 5 లక్షల హెక్టార్లలో పంటల్ని తినేశాయి.


ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు తర్వాతి మిడతల దాడి ప్రభావిత జాబితాలో ఉన్నాయి. జులైలోగా మరిన్ని మిడతలు రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒక చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో సుమారుగా 40 మిలియన్ల మిడతలు ఎగురుకుంటూ దాడి చేస్తాయని నిపుణులు గుర్తించారు. ఇవన్నీ కలిసి రోజులో 35 వేల మంది తినే ఆహారం మొత్తం తినేస్తాయని ఐక్యరాజ్యసమితిలోని ఆహార, వ్యవసాయ సంస్థ అంచనా వేసింది. ఒక్కో మిడత దాని బరువు కన్నా ఎక్కువ స్థాయిలో ఆహారాన్ని తింటాయని చెబుతున్నారు. అయితే, మిడతల దాడికి సంబంధించిన వీడియోలు సామాజి మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.





Untitled Document
Advertisements