"2020 టీ20 వరల్డ్‌కప్‌‌ గెలిచి ధోనీని భుజాలపై ఎత్తుకుని తిప్పాలి"

     Written by : smtv Desk | Fri, Jun 26, 2020, 06:10 PM


భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తరహాలో మహేంద్రసింగ్ ధోనీని కూడా ఆటగాళ్లు మైదానంలో భుజాలపై ఎత్తుకోవడాన్ని తాను చూడాలనుకుంటున్నట్లు వివాదాస్పద ఫాస్ట్ బౌలర్ ఎస్. శ్రీశాంత్ వెల్లడించాడు. 2013 ఐపీఎల్ సీజన్‌లో స్ఫాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఏడేళ్లు నిషేధం ఎదుర్కొన్న శ్రీశాంత్.. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న శ్రీశాంత్.. ధోనీ భవితవ్యం గురించి కూడా మాట్లాడాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత భారత్ జట్టుకి దూరమైన ధోనీ.. ఐపీఎల్ 2020 సీజన్‌లో రాణించడం ద్వారా మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలని ఆశించాడు. కానీ.. ఈ టోర్నీ కరోనా కారణంగా నిరవధికంగా వాయిదాపడగా.. అక్టోబరులో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌పై కూడా సందిగ్ధత నెలకొంది.
మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీలో 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే ప్రపంచకప్‌లో ఆడిన శ్రీశాంత్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘ధోనీ తప్పకుండా టీ20 వరల్డ్‌కప్‌‌లో ఆడతాడు. అంతకంటే ముందు జరిగే ఐపీఎల్ 2020 సీజన్‌లోనూ అతను రాణిస్తాడని నా నమ్మకం. ఇప్పటి వరకూ ఎన్ని విమర్శలు వచ్చినా.. ధోనీ స్పందించలేదు. దానికి కారణం.. ఎప్పుడు ఏం చేయాలో అతని బాగా తెలుసు. 2020 టీ20 వరల్డ్‌కప్‌‌ని భారత్ గెలిచిన తర్వాత ధోనీని సహచరులు భుజాలపై ఎత్తుకుని మైదానంలో తిరుగుతుంటే చూడాలనేది నా కోరిక’’ అని శ్రీశాంత్ వెల్లడించాడు.
టీ20 వరల్డ్‌కప్‌ని ఐసీసీ వాయిదా వేయబోతోందని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు వెలువడటంతో సెప్టెంబరు - నవంబరు మధ్యలో ఐపీఎల్ 2020 సీజన్‌ని నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒకవేళ టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్ ప్రకారం జరిగితే..? అప్పుడు పూర్తి స్థాయిలో ఐపీఎల్ జరగడం సందేహమే.





Untitled Document
Advertisements