బుమ్రా నోబాల్ వల్లే భారత్‌ ఓటమి పాలైంది: భువీ

     Written by : smtv Desk | Sat, Jun 27, 2020, 05:44 PM

బుమ్రా నోబాల్ వల్లే భారత్‌ ఓటమి పాలైంది: భువీ

ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా నోబాల్ తప్పిదం కారణంగానే 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ఓడిపోయిందని సహచర బౌలర్ భువనేశ్వర్ కుమార్ అభిప్రాయపడ్డాడు. పాకిస్థాన్‌తో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఆ ఫైనల్ మ్యాచ్‌లో బుమ్రా నోబాల్ కారణంగా ఫకార్ జమాన్‌కి లైఫ్ లభించగా.. అతను సెంచరీతో పాక్‌ని తిరుగులేని స్థితిలో నిలిపాడు.
ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన బుమ్రా బౌలింగ్‌లో ఫకార్ జమాన్ 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే ధోనీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కానీ.. రిప్లైలో ఆ బంతి నోబాల్ అని తేలడంతో.. జీవనదానం పొందిన ఫకార్ జమాన్ (114: 106 బంతుల్లో 12x4, 3x6) సెంచరీ బాదేశాడు. దాంతో.. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 4 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన భారత్ 30.3 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌటైంది.

‘‘బుమ్రా నోబాల్ తర్వాత మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. అయితే.. ఆ ఫైనల్ మ్యాచ్ ఏకపక్షంగా ముగిసిపోకుండా ఉండేందుకు చాలా పోరాడాం. కానీ.. దురదృష్టకరంగా.. ఓడిపోయాం. పాకిస్థాన్ క్రికెటర్ల తక్కు స్కోరుకే టీమిండియాని కట్టడి చేయగలిగారు. ఆ ఫైనల్ మ్యాచ్‌ ఓటమికి సరైన కారణం చెప్పడం కష్టం. కానీ.. బుమ్రా నోబాల్ మ్యాచ్‌లో కీలక మలుపు’’ అని భువనేశ్వర్ కుమార్ వెల్లడించాడు.

వాస్తవానికి అప్పటి వరకూ ఫకార్ జమాన్ గురించి క్రికెట్ ప్రపంచానికి పెద్దగా తెలియదు. కానీ.. ఒక్క మ్యాచ్‌తో అతను పాకిస్థాన్‌కి హీరోగా మారిపోయాడు. మరోవైపు జస్‌ప్రీత్ బుమ్రాని ఆ నోబాల్‌పై ఇప్పటికీ అభిమానులు ఆడుకుంటూ ఉంటారు. జైపూర్ పోలీసులు ‘బుమ్రా నోబాల్’ ఫొటోని ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కోసం అప్పట్లో వినియోగించారు.





Untitled Document
Advertisements