పాక్ క్రికెట్‌‌ జట్టులో ఆరుగురికి కరోనా నెగటివ్

     Written by : smtv Desk | Sun, Jun 28, 2020, 11:09 AM

పాక్ క్రికెట్‌‌ జట్టులో ఆరుగురికి కరోనా నెగటివ్

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి కరోనా వైరస్ టెస్టుల రూపంలో ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ వారం ఆరంభంలో ఇంగ్లాండ్ పర్యటనకి ఎంపికైన 29 మంది ఆటగాళ్లకి కరోనా వైరస్ పరీక్షల్ని పీసీబీ నిర్వహించగా.. అందులో 10 మందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. దాంతో.. వారందరినీ సెల్ఫ్ ఐసోలేషన్‌కి వెళ్లిపోవాలని పీసీబీ ఆదేశించగా.. ఒక్క మహ్మద్ హఫీజ్ మాత్రం సాహసోపేతంగా ప్రైవేట్‌ ల్యాబ్‌లో టెస్టులు చేయించుకున్నాడు. ఆ టెస్టులో నెగటివ్ రావడంతో.. సోషల్ మీడియా ద్వారా ఆ విషయాన్ని వెల్లడించిన హఫీజ్.. వివాదానికి తెరలేపాడు.ఒక్క రోజు వ్యవధిలోనే హఫీజ్‌కి నెగటివ్ రావడంతో అలర్ట్ అయిన పీసీబీ.. శుక్రవారం హఫీజ్‌కి మరోసారి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపింది. దాంతో.. సెల్ఫ్ ఐసోలేషన్‌కి వెళ్లకుండా పరీక్షల కోసం ఫ్యామిలీతో కలిసి ప్రైవేట్ ల్యాబ్‌కి వెళ్లిన హఫీజ్‌పై చర్యలు తీసుకునేందుకు పీసీబీ సిద్ధమైంది. కానీ.. శనివారం మరోసారి 10 మంది ఆటగాళ్లకి పరీక్షలు నిర్వహించగా.. ఇందులో హఫీజ్‌తో సహా ఆరుగురికి నెగటివ్ వచ్చినట్లు పాకిస్థాన్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సాజ్ సాధిక్ వెల్లడించాడు.

పాకిస్థాన్‌లో కరోనా వైరస్ టెస్టింగ్ ల్యాబ్స్ సామర్థ్యంపై ఫస్ట్ నుంచి అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. తాజాగా వారం వ్యవధిలో 10 మంది ఆటగాళ్లకి కరోనా పాజిటివ్, నెగటివ్ రావడం.. మధ్యలో హఫీజ్‌కి పాజిటివ్, నెగటివ్.. పాజిటివ్.. నెగటివ్ రావడంతో పాక్ క్రికెట్‌లో మొత్తం గందరగోళ వాతావరణం నెలకొంది. ఇంగ్లాండ్‌తో మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్ ఆడేందుకు ఆదివారం అక్కడికి పాకిస్థాన్ జట్టు బయల్దేరాల్సి ఉంది. ఈ నేపథ్యంలో.. ఈ కరోనా వైరస్ టెస్టుల తికమకతో పీసీబీ ఎటూ తేల్చుకోలేకపోతోంది.






Untitled Document
Advertisements