భారత సైన్యం విజయం: కశ్మీర్‌లో హిజ్బుల్ అగ్రనేత హతం!

     Written by : smtv Desk | Mon, Jun 29, 2020, 11:05 AM

భారత సైన్యం విజయం: కశ్మీర్‌లో హిజ్బుల్ అగ్రనేత హతం!

కశ్మీర్‌లో ఉగ్రవాదులపై పోరులో సైన్యం మరో భారీ విజయం సాధించింది. అనంత్‌నాగ్‌లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. వీరిలో హిజ్బుల్ ముజాయిద్దీన్ టాప్ కమాండర్ మసూద్ అహ్మద్ భట్ సహా మరో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు ఉన్నారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్చోహర్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా పాల్గొన్నారు. మసూద్ అహ్మద్ భట్‌ను సైన్యం హతమార్చడంతో జమ్మూలోని దోడా జిల్లా ఉగ్రవాద రహితమయ్యింది పోలీస్ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో చిట్టచివరి ఉగ్రవాది మసూద్ భట్‌ అని తెలిపారు.

‘అనంత్‌నాగ్‌లోని కుల్చోహర్ వద్ద జరిగిన ఆపరేషన్‌లో పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన సైన్యం పాల్గొంది.. ఈ ఆపరేషన్‌లో హిజ్బుల్ డిస్ట్రిక్ట్ కమాండర్ మసూద్ అహ్మద్ భట్, లష్కరే తొయిబా ఉగ్రవాదులు హతమయ్యారు.. చిట్టచివరి ఉగ్రవాది మసూద్‌ను హతమార్చడంతో దోడా ఉగ్రవాద రహిత జిల్లాగా మారిపోయింది’ అని జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ అన్నారు.

ఓ అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న మసూద్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని.. తర్వాత హిజ్బుల్ ముజాయిద్దీన్ ఉగ్రవాద సంస్థలో చేరాడు.. తర్వాత కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాల్లో నిర్వహిస్తున్నాడు’ అని అన్నారు. దక్షిణ కశ్మీర్‌లో 29 మంది విదేశీ ఉగ్రవాదులున్నట్టు జమ్మూ కశ్మీర్ పోలీసులు శనివారం ప్రకటించారు.

‘కోకేర్‌నాగ్, త్రాల్, ఖేర్యూలోని పలు ప్రాంతాల్లో విదేశీ ఉగ్రవాదులు ఉనికి ఉంది.. మొత్తం 29 మంది ఉగ్రవాదులు దక్షిణ కశ్మీర్‌లో ఉన్నారని నిఘా వర్గాలు సమాచారం అందజేశాయి.. వారందరినీ మట్టుబెటడతామని కశ్మీర్ రేంజ్ ఐజీ విజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతానికి చెందిన హిజ్బుల్ ముజుయిద్దీన్ ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో భద్రతా దళాలు భారీ విజయాన్ని సాధించాయని, దక్షిణ కశ్మీర్ నుంచి ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.



కాగా, ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 100 మందికిపైగా ఉగ్రవాదులను సైన్యం హతమార్చినట్టు డీజీపీ వెల్లడించారు. వీరిలో 50 మంది హిజ్బుల్ ముజాయిద్దీన్ ఉగ్రవాదులు, లష్కరే తొయిబా, జైషే మొహమూద్‌కు చెందినవారు 20 చొప్పున, మిగతా 10 మంది అల్ బదర్, అన్సార్ గజావతుల్ హింద్ వంటి ఉగ్రవాదులున్నారు. కశ్మీరీ ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైందని డీజీపీ వ్యాఖ్యానించారు.





Untitled Document
Advertisements