ఎస్.జానకి ఇకలేరంటూ సోషల్ మీడియాలో వార్తలు...పలువురు ప్రముఖులు సీరియస్!

     Written by : smtv Desk | Mon, Jun 29, 2020, 04:43 PM

ఎస్.జానకి ఇకలేరంటూ సోషల్ మీడియాలో వార్తలు...పలువురు ప్రముఖులు సీరియస్!

దిగ్గజ గాయని ఎస్.జానకి ఇకలేరనే వదంతులు ఆదివారం సాయంత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాప్తి చెందాయి. ఈ తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో చూసిన ఆమె అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఇక ఆమె కుటుంబ సభ్యులు అయితే తీవ్ర ఆందోళన చెంది తరవాత జానకి అమ్మ ఆరోగ్యంపై స్పష్టత ఇచ్చారు. జానకి అమ్మ ఆరోగ్యంపై ఇలాంటి వదంతులు దయచేసి వ్యాప్తి చేయొద్దని ప్రతి ఒక్కరినీ విజ్ఞప్తి చేశారు. కాగా, జానకికి ఒక చిన్న శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. ఈలోపలే ఆమె కన్నుమూశారంటూ వదంతులను ఇంటర్నెట్‌లో వ్యాప్తి చేసేశారు.
ఇదిలా ఉంటే, జానకి అమ్మ ఆరోగ్యంపై వచ్చిన రూమర్‌పై గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్పందించారు. ఇలాంటి రూమర్లు ఎందుకు పుట్టుకొస్తాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఆయన ఒక వీడియో మెసేజ్‌ను పోస్ట్ చేశారు. ‘‘జానకి అమ్మ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి ఈరోజు ఉదయం నుంచి నాకు 20 మంది ఫోన్ చేశారు. దీనికి కారణం సోషల్ మీడియాలో కొంత మంది జానకి అమ్మ చనిపోయారంటూ పోస్టులు పెట్టడమే. ఏంటి ఈ అర్థంపర్థంలేని పనులు. నేను ఆమెతో మాట్లాడాను. ఆమె చాలా బాగున్నారు’’ అని బాలు స్పష్టం చేశారు.
సోషల్ మీడియాను పాజిటివిటీని వ్యాప్తి చేయడానికి వాడాలని, ఇలాంటి విషయాల్లో చిలిపి చేష్టలు పనికిరావని బాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాను మంచిని వ్యాప్తి చేయడానికి వాడాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, సీనియర్ గాయకుడు మనో కూడా జానకి ఆరోగ్యంపై స్పందించారు. ‘‘ఇప్పుడే జానకి అమ్మతో మాట్లాడాను. ఆమె మైసూరులో ఉన్నారు. ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. దయచేసి వదంతులు వ్యాప్తి చేయకండి’’ అని మనో ట్వీట్ చేశారు.
కాగా, జానకి అమ్మ వయసు ప్రస్తుతం 82 సంవత్సరాలు. మూడు దశాబ్దాలకు పైగా దక్షిణాది సంగీత ప్రియులను మంత్ర ముగ్ధులను చేసిన గాత్రం జానకి అమ్మది. సినిమా ఇండస్ట్రీలోనే వైవిధ్యమైన గాయని ఆమె. తన సుధీర్ఘ కెరీర్‌లో 45 వేలకు పైగా పాటలు పాడారు. నైటింగేల్ ఆఫ్ సౌత్‌గా పిలుచుకునే జానకి అమ్మ.. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యంలో అత్యధిక పాటలు ఆలపించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సహా 17 భాషల్లో జానకి అమ్మ పాటలు పాడారు.

Untitled Document
Advertisements