మహారాష్ట్రలో జులై 31 వరకు లాక్‌డౌన్

     Written by : smtv Desk | Mon, Jun 29, 2020, 08:00 PM

మహారాష్ట్రలో జులై 31 వరకు లాక్‌డౌన్

కరోనా కరాళనృత్యం చేస్తున్న వేళ మహారాష్ట్ర కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్‌ను జులై 31 వరకు పొడిగించింది. సోమవారం (జూన్ 29) ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ‘మిషన్ మళ్లీ మెదలు’ అంటూ కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. ముంబై మెట్రో పాటిటన్ రీజియన్‌లో అత్యవసరాలు మినహా.. అన్ని ఇతర కార్యక్రమాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. షాపింగ్, ఇతర ఔట్‌డోర్ ఎక్సర్‌సైజెస్‌పై పూర్తి నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది.
అత్యవసర సేవలు, కార్యాలయాలకు వెళ్లేవారిని మాత్రమే అనుమతించనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే.. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని పేర్కొంది.

ముంబై మెట్రో పాలిటన్ నగరంలో అన్ని ప్రైవేట్ కార్యాలయాల్లో కనీసం 10 మంది లేదా 10 శాతం మందితో విధులు కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చునని మహారాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కనీసం 15 మంది లేదా 15 శాతం మందితో కార్యకలాపాలు కొనసాగించాలని స్పష్టం చేశారు. వైద్య శాఖ, పోలీస్ శాఖ లాంటి అత్యవసర సేవలు అందించే శాఖల్లో పనిచేసే వారికి ఈ ఆంక్షల నుంచి మినహాయింపులు ఇచ్చారు. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత కరోనా కేసులు సంఖ్య పెరుగుతుండటంతో ఒక్కో రాష్ట్రం మళ్లీ లాక్‌డౌన్ విధిస్తూ వస్తున్నాయి. ఇప్పటికే అసోం, జార్ఖండ్ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడిగించాయి. అవసరమైతే హైదరాబాద్‌లోనూ లాక్‌డౌన్ విధించే యోచనలో ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం సంకేతాలిచ్చింది.

దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో ఆది నుంచి కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. కరోనా కేసుల్లో మహారాష్ట్ర దేశంలో తొలి స్థానంలో ఉంది. దేశ రాజధాని ఢిల్లీ తర్వాత ముంబై నగరం రెండో స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 5.48 లక్షల కరోనా కేసులు నమోదు కాగా, కేవలం మహారాష్ట్రలోనే 1,64,626 మందికి కరోనా సోకింది.మహారాష్ట్రలో ఇప్పటివరకు కరోనా బారినపడి 7,429 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకొని 86,575 మంది డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం 70,622 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ముంబైలో కరోనా వ్యాప్తి ప్రమాదకర స్థితిలో ఉంది. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 5493 కొత్త కేసులు నమోదయ్యాయి.

Untitled Document
Advertisements