ఐసీసీ ఫ్యానల్ అంపైర్‌గా నితిన్ మీనన్

     Written by : smtv Desk | Mon, Jun 29, 2020, 08:01 PM

ఐసీసీ ఫ్యానల్ అంపైర్‌గా నితిన్ మీనన్

భారత అంపైర్ నితిన్ మీనన్‌కి అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఎలైట్ ఫ్యానల్‌ అంపైర్‌గా 36ఏళ్ల నితిన్ మీనన్‌ సోమవారం ఎంపికయ్యాడు. ఫ్యానల్‌ నుంచి ఇంగ్లాండ్‌కి చెందిన నిగల్ లాంగ్‌ని తప్పించిన ఐసీసీ.. అతని స్థానంలో నితిన్ మీనన్‌కి అవకాశం ఇచ్చింది. భారత్ తరఫున ఈ ఫ్యానల్‌లో చోటు దక్కించుకున్న మూడో భారతీయుడిగా నితిన్ నిలవగా.. గతంలో శ్రీనివాస్ వెంకటరాఘవన్, సుందరం రవికి ఈ గౌరవం దక్కింది.
వాస్తవానికి నితిన్ మీనన్‌‌కి పెద్దగా క్రికెట్ ఆడిన అనుభవం లేదు. మధ్యప్రదేశ్ తరఫున రెండు లిస్ట్-ఎ మ్యాచ్‌లు మాత్రమే అతను ఆడాడు. 2006లో అంపైర్ల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎగ్జామ్స్ నిర్వహించగా.. తన తండ్రి నరేంద్ర మీనన్ ప్రోద్బలంతో ఆ పరీక్షకి హాజరైనట్లు నితిన్ మీనన్ వెల్లడించాడు. ఆ ఎగ్జామ్‌లో పాసవడంతో అంపైరింగ్‌ని ప్రొఫెషన్‌గా ఎంచుకున్నట్లు చెప్పుకొచ్చిన నితిన్.. 23 ఏళ్ల వయసులోనే తాను అంపైరింగ్‌పై పట్టు సాధించినట్లు వివరించాడు.

నితిన్ మీనన్ ఇప్పటి వరకూ మూడు టెస్టులు, 24 వన్డేలు, 16 టీ20 మ్యాచ్‌లకి అంపైరింగ్ చేశాడు. ఐసీసీ ఎలైట్ ఫ్యానల్ అంపైర్‌గా నితిన్ మీనన్‌ని ఎంపిక చేసిన సెలక్షన్ ఫ్యానల్‌లో ఐసీసీ జనరల్ మేనేజర జెఫ్ అలార్డిస్‌, భారత మాజీ క్రికెటర్/ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్, మ్యాచ్ రిఫరీ రంజన్ తదితరులు ఉన్నారు.





Untitled Document
Advertisements