తండ్రీ కొడుకుల ‘పోలీసు కస్టడీ డెత్’: పోలీసుల బాగోతం బయటపెట్టిన సీసీటీవీ

     Written by : smtv Desk | Tue, Jun 30, 2020, 03:56 PM

తండ్రీ కొడుకుల ‘పోలీసు కస్టడీ డెత్’: పోలీసుల బాగోతం బయటపెట్టిన సీసీటీవీ

ట్యూటీకొరిన్ తండ్రీ కొడుకుల ‘పోలీసు కస్టడీ డెత్’తో నిరసనలు, ఆందోళనలతో తమిళనాడు అట్టడుకుతోంది. తాజాగా, ఈ వివాదం సోమవారం కొత్త మలుపు తిరిగింది. అరెస్ట్ చేయడానికి ముందే తండ్రీ కొడుకులు రోడ్డుపై పడిపోయారని, దీంతో వారికి తీవ్రగాయాలైనట్టు పోలీసులు అల్లింది కట్టుకథేనని తేలింది. పోలీసులు కస్టడీలోకి తీసుకోకముందు వారికి ఎలాంటి గాయాలులేవని అక్కడ సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టింది. మృతులు జయరాజ్ (58), బెనిక్స్ (31) సెల్‌ఫోన్ దుకాణం నడిపే సాతాంకుళంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను అక్కడ వ్యాపారులు విడుదల చేయడంతో పోలీసులు చెప్పేవన్నీ అబద్దాలేనని వెల్లడయ్యింది.

కస్టడీలో ఉన్నప్పుడు వారిని గాయపరచలేదని ఎఫ్ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం విడుదల చేసిన 15 నిమిషాల నిడివిగల సీసీటీవీ ఫుటేజ్‌లో మాత్రం ఆధారాలు స్పష్టంగా చూపుతున్నాయి. ఈ ఘటనపై బెనిక్స్ స్నేహితుడు మాట్లాడుతూ.. ‘జూన్ 18న రాత్రి 8.00 గంటల ప్రాంతంలో అక్కడకు వచ్చిన పోలీసులు.. దుకాణాలు మూసేయాలని ఆదేశించారు.. అదే సమయంలో జయరాజ్ మరికొందరు బెనిక్స్ షాప్ ముందు ఉన్నారు.. పోలీసులను జయరాజ్ దుర్బాషలాడినట్టు ఆ తర్వాతి రోజు జూన్ 19న ఉదయం ఎవరో ఫిర్యాదు చేశారు.
దీంతో అదే రోజు రాత్రి 7.30 గంటలకు ఓ కానిస్టేబుల్ అక్కడకు వచ్చి జయరాజ్‌తో మాట్లాడి వెళ్లాడు.. వెంటనే 8 నిమిషాల తర్వాత మళ్లీ మరొకరితో కలిసి వచ్చి, రోడ్డు పక్కనే ఎస్ఐ ఉన్నారని, మిమ్మల్ని తీసుకురమ్మనాడని చెప్పి తీసుకెళ్లాడు.. దీంతో తొలుత జయరాజ్ వెళ్లగా.. తర్వాత బెనిక్స్ వెళ్లాడు.. అనంతరం జయరాజ్‌ను పోలీసులు తమ వాహనంలో ఎక్కించుకుని, బెనిక్స్‌ను పోలీస్ స్టేషన్‌కు రమ్మని చెప్పారు’ అని వివరించాడు.
ఆ సమయంలో ప్రాంతంలోని అన్ని దుకాణాలు తెరిచే ఉన్నాయని, షాపును మూసివేయడానికి ఏపీజే మొబైల్స్ ఎక్కువ సమయం తీసుకోలేదని వీడియో వెల్లడించింది. కాగా.. ఈ కేసులు సీబీఐకి అప్పగిస్తామని తమిళనాడు సీఎం పళనిసామి ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ కేసును మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ సొంతంగా దర్యాప్తు చేస్తోందని, కోర్టు అనుమతితో సీబీఐకి ఇస్తామని తెలిపారు.
‘జయరాజ్ , అతని కొడుకు బెనిక్స్ తూత్తుకుడిలో మొబైల్ షాపును నడుపుతున్నారు. లాక్‌డౌన్ టైమ్‌లో షాపును నిర్దేశించిన సమయంలో మూసేయకుండా పోలీసులతో జరిగిన వాగ్వాదంతో అరెస్టయ్యారు. తర్వాత ఇద్దరూ కోవిల్‌పట్టి హాస్పిటల్‌లో చనిపోయారు’ అని సీఎం చెప్పారు. అయితే లాకప్‌లోనే తండ్రీ కొడుకులు మృతి చెందడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఘటనకు కారణమైన వాళ్లపై హత్య కేసు పెట్టాలని జయరాజ్ కుటుంబీకులు డిమాండ్ చేశారు. ఈ ఘటనలో ఇప్పటికే ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు.





Untitled Document
Advertisements