రూల్స్ బ్రేక్: ప్రదానికే రూ.13 వేల జరిమానా విధించారు!!!

     Written by : smtv Desk | Tue, Jun 30, 2020, 06:19 PM

రూల్స్ బ్రేక్: ప్రదానికే రూ.13 వేల జరిమానా విధించారు!!!

దేశంలో కరోనా ఓ వైపు విజృంభిస్తుండగా.. ఫ్లూ సీజన్‌ రాబోతోందని, ప్రజలు మున్ముందు మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోదీ హెచ్చరించారు. అన్‌లాక్‌-1 తర్వాత ప్రజల వ్యవహార శైలిలో కాస్త నిర్లక్ష్య ధోరణి కనిపించిందని ఆయన అన్నారు. బయటకెళ్తే తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని సూచించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని వారిపట్ల ఇకపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. మంగళవారం (జూన్ 30) సాయంత్రం 4 గంటలకు ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
‘కరోనాతో పోరాటం చేస్తూ అన్‌లాక్‌ 2.0లోకి ప్రవేశించాం. ఈ సమయంలో జలుబు, జ్వరం లాంటి రకరకాల రోగాలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. కరోనా కట్టడికి ప్రభుత్వాలు విధించిన నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని మోదీ అన్నారు.
కరోనా కట్టడి విషయంలో భారత్ మెరుగ్గా పనిచేసిందని మోదీ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌తో లక్షలాది మంది ప్రాణాలను కాపాడగలిగామని తెలిపారు. దేశ ప్రజల సహకారం ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా అధిగమించేలా చేసిందని పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాలు అద్భుత పనితీరును కనబరిచాయని అన్నారు. మున్ముందు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఇకపై కంటైన్‌మెంట్‌ జోన్లపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. నిబంధనలు పాటించని వారి తీరు మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. కొవిడ్‌-19 నిబంధనలు పాటించకపోతే జరిమానా విధించాలని సూచించారు.
‘మాస్కు ధరించకుండా బయటకు వెళ్లినందుకు ఒక దేశ ప్రధానికే రూ.13 వేల జరిమానా విధించారు. అలాగే దేశంలోనూ నిబంధనలు కఠినంగా అమలు చేయాలి. చట్టానికి ఎవరూ అతీతులు కారు’ అని మోదీ పేర్కొన్నారు. మన పోరాటం 130 కోట్ల మందిని కాపాడుకొనేందుకేనని చెప్పారు.





Untitled Document
Advertisements