"లాక్ డౌన్‌లో ప్రజలు వాళ్ల డ్యూటీ వాళ్లు చేశారు.. ఇక చేయాల్సింది ప్రభుత్వాలే"

     Written by : smtv Desk | Tue, Jun 30, 2020, 07:13 PM


కరోనా విషయంలో ప్రభుత్వాల మాటలకు చేతలకు చాలా తేడా ఉందన్నారు మెగా బ్రదర్ నాగబాబు. మళ్లీ లాక్ డౌన్ అంటే అది ప్రభుత్వాల వైఫల్యమే అన్నారు నాగబాబు. మళ్లీ లాక్ డౌన్ చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సంచలన కామెంట్స్ చేశారు నాగబాబు. 90 రోజుల పాటు ఇళ్లలో నుంచి బయటకు రాకుండా వాళ్ల డ్యూటీ వాళ్లు సక్రమంగా చేశారని.. అయితే ఆ ఆ టైంలో ప్రభుత్వాలు చేయాల్సిన పనుల్ని, ప్రజలకు అందించాల్సిన కనీస అవసరాలను విస్మరించిందని అన్నారు నాగబాబు. లాక్ డౌన్ టైంలో మెడికల్ రిసోర్స్‌ని కూడకట్టుకోలేకపోయిందని.. ఇప్పుడు మళ్లీ లాక్ డౌన్ చేస్తే చారిత్రక తప్పిదం అవుతుందన్నారు నాగబాబు. యూట్యూబ్‌లో ‘మన ఛానల్ మన ఇష్టం’ అంటూ మెగా బ్రదర్, జనసేన నాయకుడు నాగబాబు కరెంట్ టాపిక్స్‌పై తనకు తోచిన సూచనలు, సలహాలు చేస్తున్నారు. తాజాగా తెలంగాణలో మళ్లీ లాక్ డౌన్ చేస్తున్నారనే వార్తలపై స్పందిస్తూ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు నాగబాబు.ప్రభుత్వానికి మళ్లీ లాక్ డౌన్ పెట్టాలనే ఆలోచన ఉందని వార్తలు వస్తున్నాయి. వీటిపై నేను ప్రశ్నించాలని అనుకునేది ఏంటంటే.. అసలు లాక్ డౌన్ పర్పస్ ఏంటి?? కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేయడం.. మెడికల్ రిసోర్స్‌ని సమీకరించుకోవడం కోసం లాక్ డౌన్ విధించారని నేను అనుకుంటున్నా. గతంలో 60 నుంచి 90 రోజులు లాక్ డౌన్ విధించారు. ఈలోపు కేంద్ర ప్రభుత్వం కాని.. రాష్ట్ర ప్రభుత్వం కాని మెడికల్ రిసోర్స్‌ని కూడకట్టుకుని ఉండాల్సింది.90 రోజుల పాటు ప్రజలు లాక్ డౌన్ వల్ల తమ జీవితాలను త్యాగం చేశారు.. ఎంత నష్టపోయారో అందరికీ తెలుసు. వలస కార్మికుల కష్టాలు చెప్పలేం. నోరు లేని జీవులు సైతం చాలా ఇబ్బందులు పడ్డాయి. కాని ఆ టైంలో మీరు చేయాల్సింది చేయకుండా.. ఇప్పుడు మళ్లీ లాక్ డౌన్ అంటూ జనజీవనాన్ని స్తంభింపచేయడం, ఆలోచన ఆలోచన చేయడం 100 శాతం కరెక్ట్ కాదు. మళ్లీ లాక్ డౌన్ చేశారంటే అది హిస్టారికల్ మిస్టేక్ అవుతుంది.చాలా దేశాలు లాక్ డౌన్ లేకుండా.. సక్సెఫుల్‌గా ప్రజల్ని కాపాడగలిగారు. అయితే మన దేశం పెద్దది కాబట్టి సమస్యలు ఉంటాయి. కాని.. మళ్లీ లాక్ డౌన్ అంటే చారిత్రాత్మక తప్పిదం చేసినట్టే. ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు.. నాలా మాట్లాడే వాళ్లు కోట్లాది మంది ఉన్నారు. మళ్లీ లాక్ డౌన్ పెడితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. వెధవ కరోనా చస్తే చచ్చాం.. తినడానికి తిండిలేదు.. బతుకు గడవడం లేదు. కరోనా వస్తే ఏంటి అనే పరిస్థితి వచ్చి.. ప్రజల్లో రివల్యూషన్ మైండ్ వచ్చేస్తుంది. అలాంటి ఆలోచనలు వచ్చేలా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు.కరోనా వస్తే ఎలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చెప్పాలి. అంతేతప్ప మళ్లీ లాక్ డౌన్ చేయడం కరెక్ట్ కాదు. ఇలాంటి ఆలోచన ఉంటే విరమించుకోవాలని లక్షలాది మంది ప్రజల పక్షాన నేను కోరుకుంటున్నా.. మళ్లీ లాక్ డౌన్ చేస్తే బిగ్ మిస్టేక్ అవుతుంది. దయచేసి లాక్ డౌన్ కాన్సెప్ట్ వద్దు. మీరు కరోనా బారిన పడ్డ వారికి ఏదోటి చేస్తారనే ఉద్దేశంతో 90 రోజులు బయటకు రాకుండా ఉన్నారు. నాకైతే ఇబ్బంది లేదు.. కాని సాధారణ జనం పరిస్థితి ఏంటి? కోట్లాది మంది జీవితాలు ఏమైపోతాయి. మళ్లీ లాక్ డౌన్ ఎందుకు చేస్తారు. గతంలో ప్రభుత్వాలు లాక్ డౌన్ చేసినప్పుడు ప్రజలు ఇంట్లో ఉండి వాళ్ల డ్యూటీ వాళ్లు చేశారు. ఇప్పుడు ప్రభుత్వాలు తమ డ్యూటీ తాము చేయాలి.ఎవరికి కరోనా లక్షణాలు ఉన్నా.. వాళ్లకి బాగు చేయించే సదుపాయాలను ఇప్పటికే కల్పించాలి. కాని మీరు వాటిని సమీకరించుకోలేకపోవడం మీ తప్పే అవుతుంది. ప్రభుత్వాలు ఫెయిల్ అయినట్టే. మాటలు చెప్పడం వేరు.. దాన్ని ఆచరణలో పెట్టడం వేరు. ప్రభుత్వాలను చాలా మంది విమర్శించినప్పుడు కరెక్ట్ కాదని చెప్పాను. ప్రభుత్వాలకు సపోర్ట్‌గా మాట్లాడా. కాని ఇప్పుడు లాక్ డౌన్ నిర్ణయం ప్రభుత్వ వైఫల్యంగా కనిపిస్తుంది. దయచేసి మళ్లీ లాక్ డౌన్ వద్దు’ ఆవేశంగా మాట్లాడారు నాగబాబు.









Untitled Document
Advertisements