'డాక్టర్స్ డే': దీని వెనుక కారణం ఏంటి?

     Written by : smtv Desk | Wed, Jul 01, 2020, 10:35 AM

'డాక్టర్స్ డే': దీని వెనుక కారణం ఏంటి?

మనకి ఏదైనా సమస్య వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం.. ప్రతి ప్రొఫెషన్‌కి ఓ టైమ్ అంటూ ఉంటుంది. కానీ, కొన్నింటికి అసలు టైమింగ్స్ అసలు ఉండవు. మనకి ఆరోగ్య సమస్యలు ఎప్పుడు ఎదురైతే అప్పుడు వెళ్తాం. అలాంటప్పుడు డాక్టర్స్ ఎలా ప్రాణాలు కాపాడతారు.


డాక్టర్స్ ప్రాణాలు నిలుపుతారు. వారు నిజానికి అంత కంటే ఎక్కువే చేస్తారు. వాళ్ళు పేషెంట్ మానసికస్థితిని బట్టి వ్యవహరిస్తారు. పేషెంట్ కి బాధ కలుగకుండా చేసే చికిత్సపై దృష్టి పెడతారు. రోగి త్వరగా కోలుకునేలా చేస్తారు. ఒకవేళ ఒకరికి నయం చేయలేని వ్యాధి వస్తే వారు తమ మిగిలిన జీవితాన్ని హాయిగా గడిపేందుకు కృషి చేస్తారు. అలాంటి డాక్టర్స్‌ కి డాక్టర్స్ డే రోజున మన కృతజ్ఞతలు తెలుపుకుందాం.

ప్రతి సంవత్సరం జులై ఒకటవ తారీకున డాక్టర్స్ డే జరుపుకుంటున్నాం. ఈ రోజుని పశ్చిమ బెంగాల్ రెండవ ముఖ్యమంత్రి డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ స్మృతి సందర్భంగా జరుపుకుంటున్నాం. ఈ డాక్టర్స్ డేని మొదటిసారి 1991లో జరుపుకున్నాం.

డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జులై 1, 1882 లో జన్మించారు. జులై 1, 1962లో మరణించారు. 1961 లో ఆయనను భారత ప్రభుత్వం అత్యున్నతమైన పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించింది.

డాక్టర్ బిధాన్ రాయ్ పేరొందిన ఫిజీషియనే కాదు, ఆయన గొప్ప స్వతంత్ర యోధుడు కూడా. ఆయన కలకత్తా మెడికల్ కాలేజ్ లో చదువుకున్న్నరు. తరువాత సెయింట్ బార్థాలమ్యూ హాస్పిటల్ లో మెడిసిన్ లో పీజీ చేశారు. ఆ తరువాత రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్, రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ లో సభ్యత్వం సాధించారు. ఇండియా కి తిరిగి వచ్చిన తరువాత కలకత్తా మెడికల్ కాలేజ్ లోనే పని చేశారు. ఆ తరువాత కాంప్బెల్ మెడికల్ స్కూల్, కార్మికేల్ మెడికల్ కాలేజ్ లో పని చేశారు. ఆయన జాదవ్పూర్ టీబీ హాస్పిటల్, చిత్త రంజన్ సేవా సదన్, కమలా నెహ్రూ మెమోరియల్ హాస్పిటల్, చిత్తరంజన్ కాన్సర్ హాస్పిటల్ వంటి అనేక సంస్థలు స్థాపించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన పశ్చిమ బెంగాల్ కు రెండవ ముఖ్య మంత్రిగా 1948 నుండి 1962 లో మరణించేవరకూ తన సేవలందించారు. ఆయనని ఆర్కిటెక్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అని అంటారు. పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్, బిధాన్ నగర్,అశోక్ నగర్, కల్యాణి, హబ్రా అనే ఐదు సిటీలను ఆయన అభివృద్ధి చేశారు. ఆయన బ్రహ్మ సమాజం లో సభ్యుడు కూడా. ఆయన గౌరవార్ధం భారత ప్రభుత్వం ఒక అవార్డ్ ను కూడా స్థాపించింది. ఆయన ఇండియన్ మెడికల్ అసోసియేషన్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ను స్థాపించడం లో కీలక పాత్ర పోషించారు.



ప్రతి సంవత్సరం డాక్టర్స్ డే ని డాక్టర్లు దేశానికి చేసే సేవలను గుర్తించడానికి సెలిబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ రోజున రకరకాల ఈవెంట్స్, యాక్టివిటీస్ ని కండక్ట్ చేస్తారు. ఫ్రీ మెడికల్ కాంప్స్ నిర్వహించి ఆరోగ్యం మీద అవగాహనను కలుగచేస్తారు. దేశమంతటా హెల్త్ చెకప్, ప్రివెన్షన్, రోగనిర్ధారణ, చికిత్స వంటి విషయాల మీద చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తారు. పేద ప్రజలకూ, వయో వృద్ధులకూ పోషకాహారం గురించిన వివరాలను తెలియచేస్తారు.

స్కూల్స్, కాలేజెస్ లో డాక్టర్స్ చేసే అమూల్యమైన సేవల గురించి యాక్టివిటీస్ కండక్ట్ చేసి వారిలో వైద్య వృత్తి పట్ల ఆసక్తి కలిగేలా చేస్తారు.

చికిత్స కంటే నివారణ మంచిది అని నానుడి. ప్రివెంటివ్ మెడిసిన్ లో పనిచేసే డాక్టర్స్ గురించి ఈ కార్యక్రమాల్లో వివరిస్తారు. అలాగే పాండెమిక్స్ అంటే ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న పరిస్థితి లో వారి ధైర్యాన్నీ, సేవా గుణాన్నీ అర్ధమయ్యేలా వివరిస్తారు. ఆరోగ్య రక్షణకు సంబంధించిన విధి విధానాలను రూపొందించడంలో వారి పాత్ర ఎంత ప్రాముఖ్యమైనదో తెలియజేస్తారు.





Untitled Document
Advertisements