ఈ ఏడాది గణేష్ ఉత్సవాలకు దూరం!

     Written by : smtv Desk | Wed, Jul 01, 2020, 12:13 PM

ఈ ఏడాది గణేష్ ఉత్సవాలకు దూరం!

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో ఇప్పటికే అన్ని మతాలకు చెందిన పండగలు పబ్బాలకు బ్రేకులు పడ్డాయి. ఉగాది, రంజాన్ వంటి వేడుకల్ని జనం ఇళ్లవరకే పరిమితం చేశారు. ఇక మరో నెలలో వినాయక చవితి వస్తూనే ఉంది. గణేష్ ఉత్సవాల్ని దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా మహారాష్ట్ర గణేష్ ఉత్సవాలకు పెట్టింది పేరు. ముంబైలో గణనాథుడి నవరాత్రులు ఎంతో సంబరంగా జరుపుకుంటారు. అందరూ కలిసి ఎంతో సరదాగా ఈ వేడుకల్లో పాల్గొంటారు. అయితే ఈ సారి మాత్రం వాటికి అందరూ దూరం కావాల్సిందే. కరోనా ఎఫెక్ట్‌తో ఈ సారి గణేష్ ఉత్సవాల్ని నిర్వహించడం లేదు
మహారాష్ట్రలో కరోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఆ రాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా కేసులు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గణేశ్‌ ఉత్సవాలు నిర్వహించమని లాల్‌ బాగుచా రాజా గణేశ్‌ ఉత్సవ్‌ మండల్‌ కమిటీ తెలిపింది. గణేశ్‌ ఉత్సవాలను నిర్వహించే ప్రాంతంలో రక్తం, ప్లాస్మా దానం క్యాంపులను ఏర్పాటు చేస్తామని చెప్పింది. గతేడాది చంద్రయాన్‌-2 ఆకారంలో గణేష్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈసారి మాత్రం గణేష్ ఉత్సవాలు నిర్వహించేది లేదని కమిటీ తేల్చి చెప్పింది. మొత్తం మీద కరోనా అన్ని పండగలమీద తన ఎఫెక్ట్ చూపిస్తుంది.
మరోవైపు గణేష్ ఉత్సవాలను ముంబై తర్వాత హైదరాబాద్‌లో కూడా ఘనంగా నిర్వహిస్తారు. భాగ్యనగరంలో ఖైరతాబాద్ గణేషుడి భారీ విగ్రహ నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. విగ్రహ తయారీ ప్రారంభంలో తొలి ఘట్టమైన కర్రపూజను మే 18న ప్రారంభించేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మమారి బుసలు కొడుతున్న నేపథ్యంలో.. ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా గణపతిని తయారు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్ తెలిపారు.





Untitled Document
Advertisements