ఇప్పట్లో కరోనా అంతం కాదు: డబ్ల్యూహెచ్ఓ

     Written by : smtv Desk | Wed, Jul 01, 2020, 12:50 PM

ఇప్పట్లో కరోనా అంతం కాదు: డబ్ల్యూహెచ్ఓ

ప్రపంచానికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్న కరోనా వైరస్‌కు ఇప్పట్లో అంతం లేదా? అంటే అవునంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. మహమ్మారి అంతం అంత దగ్గర్లో లేదని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్‌ అద్నామ్‌ గెబ్రియేసిస్‌ వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరిస్తోందని... ఇప్పట్లో ఈ వైరస్‌ అంతం కాదని ఆయన పునరుద్ఘాటించారు. మహమ్మారి విజృంభణ మొదలై ఆరు నెలలు పూర్తికావడంతో మరి కొన్నాళ్లు సుదీర్ఘ నిరీక్షణ తప్పదని పేర్కొన్నారు.
‘ఇది ముగిసిపోవాలని మనందరం కోరుకుంటున్నాం. ఎప్పట్లానే మన జీవితాలను గడపాలనుకుంటున్నాం. కానీ ఇది అంత త్వరగా అంతం కాదు. కఠోర వాస్తవమేంటంటే.. కనీసం మనం ముగింపునకు కూడా దగ్గర్లో లేం. ఈ వైరస్‌ను అరికట్టడంలో కొన్ని దేశాలు పురోగతి సాధించొచ్చు.. కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఇది చాలా కాలం ఉంటుంది. అందుకు మనం సిద్ధం కావాల్సిందే. ఈ వైరస్‌తో రానున్న రోజుల్లో సహజీవనం చేయాల్సిందే. అది ఎలా చేయాలన్న ప్రశ్నకు అన్ని ప్రపంచంలోని అన్ని దేశాలు సమాధానాలు వెతుక్కోవాలి’ అని టెడ్రోస్‌ వ్యాఖ్యానించారు.

కరోనా వైరస్ ముఖ్యంగా అమెరికన్లలో వేగంగా వ్యాపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ గురించి చైనా తొలిసారి ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారాన్ని అందజేసి జూన్ 30 నాటికి ఆరు నెలలు పూర్తవుతోందని అన్నారు. కోవిడ్-19 నియంత్రణ వ్యూహంలో భాగంగా కాంటాక్ట్ ట్రేసింగ్ అమలు చేయడం చాలా కష్టమని పలు దేశాలు చేసిన ఫిర్యాదుల ఆయన కొట్టిపారేశారు.

కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి బలమైన కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రోగ్రాం అవసరమని డబ్ల్యూహెచ్ఓ పదే పదే సలహా ఇచ్చింది. కరోనా వైరస్ సోకినవారితో కాంటాక్ట్ అయిన వ్యక్తులను గుర్తించే ప్రక్రియ శ్రమతో కూడుకున్నదయినా.. ప్రమాదంలో ఉన్నవారు తమను తాము రక్షించుకోడానికి తోడ్పడుతుందన్నారు. కరోనా వైరస్‌పై పోరులో విజయానికి కాంటాక్ట్ ట్రేసింగ్ ఎంతగానో తోడ్పడుతుందని, ముప్పు నుంచి కూడా రక్షిస్తుందన్నారు. ఒకవేళ ఏదైనా దేశం కాంటాక్ట్ ట్రేసింగ్ క్లిష్టమైన ప్రక్రియగా చెబితే అవి కుంటిసాకులు మాత్రమేనని అన్నారు.





Untitled Document
Advertisements