కోహ్లీ -గంభీర్ గొడవపై కామెంట్స్ చేసిన రజత్ భాటియా

     Written by : smtv Desk | Wed, Jul 01, 2020, 01:37 PM

కోహ్లీ -గంభీర్ గొడవపై కామెంట్స్ చేసిన రజత్ భాటియా

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఓ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మైదానంలోనే గొడవ పడ్డారు. ఐపీఎల్ 2013 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగగా.. ఔటై పెవిలియన్‌కి వెళ్తున్న విరాట్ కోహ్లీ‌పై గౌతమ్ గంభీర్ కవ్వింపులకి దిగాడు. దాంతో.. సహనం కోల్పోయిన విరాట్ కోహ్లీ.. గంభీర్‌తో వాగ్వాదానికి దిగగా.. ఇద్దరూ దాదాపు కొట్టుకునేలా కనిపించారు. అయితే.. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ క్రికెటర్ రజత్ భాటియా మధ్యలోకి వచ్చి ఇద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు.
ఐపీఎల్‌లో ఆ గొడవపై తాజాగా రజత్ భాటియా మాట్లాడుతూ ‘‘విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్.. ఇద్దరూ దూకుడుగా ఉండే కెప్టెన్లు. తాము ప్రాతినిథ్యం వహిస్తున్న జట్లకి విజయాల్ని అందించాలని పరితపించే వ్యక్తులు. దాంతో.. ఇద్దరి మధ్య ఆ గొడవని మ్యాచ్‌లో భాగంగానే చూడాలి. కానీ.. వారు దూషించుకున్న తీరు మాత్రం చాలా చెత్తగా ఉంది. అయితే.. ఆ గొడవ తర్వాత ఎప్పుడూ వారు మైదానంలో అలా పోట్లాడుకోవడాన్ని నేను చూడలేదు’’ అని వెల్లడించాడు.

కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకి కెప్టెన్‌గా గౌతమ్ గంభీర్ రెండు సార్లు టైటిల్స్ అందించగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని ఒక్కసారి కూడా కోహ్లీ విజేతగా నిలపలేకపోయాడు. ఇప్పటికీ.. కోహ్లీ కెప్టెన్సీ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు.. ఐపీఎల్ టైటిల్‌ గెలవలేకపోయాడంటూ గంభీర్ ఎద్దేవా చేస్తుంటాడు.





Untitled Document
Advertisements