ధోనీతో కోహ్లీకి ప్రమాదమే...కాని?

     Written by : smtv Desk | Wed, Jul 01, 2020, 04:46 PM

ధోనీతో కోహ్లీకి ప్రమాదమే...కాని?

క్రికెట్ జట్టులో ఆటగాళ్ల మధ్య పోటీతత్వం సహజం. టీమ్‌పై కెప్టెన్ పూర్తి స్థాయిలో గ్రిప్ సంపాదించుకునేందుకు సీనియర్ ఆటగాళ్లకి పక్కన పెట్టడం సర్వసాధారణం. కానీ.. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం అందుకు పూర్తి భిన్నమని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ హస్సీ వెల్లడించాడు. భారత జట్టులో మహేంద్రసింగ్ ధోనీ ఉండటంతో క్రేజ్, పాపులారిటీ పరంగా విరాట్ కోహ్లీకి దక్కాల్సినంత స్థాయిలో దక్కడం లేదు. మైదానంలో ధోనీ ఉంటే.. అందరి కళ్లు అతనిపైనే ఉంటాయి. ఇదే విషయం కోహ్లీకి కూడా తెలుసు. కానీ.. మిగిలిన కెప్టెన్ల తరహాలో కోహ్లీ ఏమాత్రం ఆలోచించడం లేదని చెప్పుకొచ్చిన మైకేల్ హస్సీ.. ధోనీ లాంటి క్రికెటర్ టీమ్‌లో ఉండటం అతనికి లాభిస్తోందని సంతోషపడుతున్నాడని వెల్లడించాడు.

2014లో టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన ధోని.. 2017 ఆరంభంలో వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దాంతో.. పూర్తి స్థాయిలో కెప్టెన్‌గా మారిన కోహ్లీ.. ధోనీకి ఇప్పటికీ మద్దతుగా నిలుస్తున్నాడు. 2017 తర్వాత కేవలం ఒకే ఒక వన్డేకి అదీ ప్రత్యామ్నాయం లేకపోవడంతో ధోనీ కెప్టెన్సీ వహించాడు.

‘‘ధోనీ విషయంలో విరాట్ కోహ్లీని అందరూ అభినందించాల్సిందే. భారత సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో ధోనీ ఒకడు. అలాంటి వ్యక్తి టీమ్‌లో ఉంటే.. కెప్టెన్ కోహ్లీకి ప్రమాదమని అప్పట్లో కొంత మంది అన్నారు. కానీ.. విరాట్ కోహ్లీ మాత్రం.. ధోనీ నా జట్టులో ఉండాలి అని పట్టుబట్టి మరీ ఆడించాడు. ధోనీ నుంచి కెప్టెన్సీ మెలకువలు నేర్చుకునేందుకు ఇష్టపడుతున్న కోహ్లీ.. అత్యుత్తమ కెప్టెన్‌గా ఎదుగుతున్నాడు’’ అని హస్సీ కితాబిచ్చాడు. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన కొత్తలో కోహ్లీ ఫెయిలవగానే.. మళ్లీ ధోనిని కెప్టెన్‌ని చేయాలని అప్పట్లో డిమాండ్స్ వినిపించాయి.





Untitled Document
Advertisements