కరోనా పరీక్షల విషయంలో సర్కార్‌పై హైకోర్టు సీరియస్

     Written by : smtv Desk | Wed, Jul 01, 2020, 05:13 PM

కరోనా పరీక్షల విషయంలో సర్కార్‌పై హైకోర్టు సీరియస్

ఇటీవల కరోనా పరీక్షలను హైదరాబాద్ పరిధిలో రెండు రోజుల పాటు నిలిపివేయడంపై తెలంగాణ హైకోర్టు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా పరీక్షలు నిలిపివేస్తూ ప్రజారోగ్య సంచాలకుడు ఉత్తర్వులు ఇవ్వడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించింది. ఐసీఎంఆర్ నిబంధనలకు విరుద్ధంగా ఆ ఉత్తర్వులు ఉన్నాయని అభిప్రాయపడింది. అంతేకాక, రాష్ట్రంలో కరోనా పరీక్షలు, మీడియా బులెటిన్‌ విషయంలోనూ పూర్తి సమాచారం అందించడం లేదని హైకోర్టు మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసింది. మీడియా బులిటెన్‌లో వార్డుల వారీగా కీలక సమాచారం ఉండాలన్న ఆదేశాలు అమలు కావడంలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
తెలంగాణలో కంటైన్మెంట్ విధానం ఎలా ఉందో తెలపాలని ఆదేశించింది. కంటైన్మెంట్ ప్రాంతాల వివరాలు కూడా సమర్పించాలని సూచించింది. గత 20 రోజులుగా జరిగిన కరోనా పరీక్షల వివరాలు సమర్పించాలని, కేంద్ర బృందం పరిశీలనలో తేలిన అంశాలను కూడా అందించాలని నిర్దేశించింది. ఈ నెల 17లోగా తాము జారీ చేసిన ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. ఒకవేళ అలా కాని పక్షంలో ఈ నెల 20న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య, మున్సిపల్‌ ముఖ్య కార్యదర్శులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కోర్టు ఎదుట హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది.





Untitled Document
Advertisements