పాక్‌ విమానయాన సంస్థకు యూరప్ దేశాలు షాక్...విమానాలు రద్దు

     Written by : smtv Desk | Wed, Jul 01, 2020, 07:07 PM

పాక్‌ విమానయాన సంస్థకు యూరప్ దేశాలు షాక్...విమానాలు రద్దు

పాకిస్థాన్ విమానయాన సంస్థకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) భారీ షాకిచ్చింది. పాక్ అంత‌ర్జాతీయ విమానయాన సంస్థపై 6 నెల‌ల‌ పాటు నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. పాక్‌కు చెందిన పైలట్లలో ఎక్కువ‌ శాతం మందికి చెందినవి న‌కిలీ లైసెన్సులేనని తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. పాక్‌ చెందిన పలు విమాన‌యాన సంస్థలపై జులై 1 నుంచి ఈ నిషేధం అమల్లో ఉంటుందని బుధవారం (జులై 1) ఒక ప్రకటనలో పేర్కొంది.
పైలట్ల నకిలీ లైసెన్సుల వ్యవహారం పాకిస్థాన్‌లో కొద్ది రోజులుగా దుమారం రేపుతోంది. పాకిస్థాన్ పార్లమెంట్‌లోనూ ఈ అంశంపై వాడీవేడీగా చర్చ జరుగుతోంది. మే నెలలో కరాచీ విమానాశ్రయం సమీపంలో ఘోర ప్రమాదం తర్వాత దిగ్ర్భాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాక్ విమానయాన సంస్థల్లో మూడో వంతు పైలెట్లవి నకిలీ లైసెన్సులేనని తేలింది.

పాకిస్థాన్‌లో 860 క్రియాశీల పైల‌ట్ లైసెన్సులు ఉండ‌గా వీటిలో దాదాపు 262 లైసెన్సులు సందేహాస్పదంగా ఉన్నాయ‌ని ప్రభుత్వం నివేదిక తెలిపింది. ఒక్క పాకిస్థాన్ అంత‌ర్జాతీయ‌ విమాన‌యాన సంస్థ (పీఐఏ)లోనే‌ మూడో వంతు పైలట్లు త‌ప్పుడు విధానంలో లైసెన్సులు పొందిన‌ట్లు విచార‌ణ‌లో తేలింది. పీఐఏలో దాదాపు 434 మంది పైలట్లు ఉండ‌గా.. వీరిలో 141 లైసెన్సుల‌ను ర‌ద్దు చేస్తున్నట్లు పాకిస్థాన్ విమాన‌యాన శాఖ మంత్రి ప్రక‌టించారు. పాక్‌లో దీనిపై దుమారం కొనసాగుతుండగానే ఈయూ సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ విమానయాన సంస్థల‌పై 6 నెల‌ల పాటు తాత్కాలిక‌ నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది.

ఈయూ నిర్ణయంతో యూర‌ప్‌కు త‌మ విమాన స‌ర్వీసుల‌ను నిలిపివేస్తున్నట్లు పాకిస్థాన్ అంతర్జాతీయ విమానయాన సంస్థ ప్రక‌టించింది. పీఐఏలో పనిచేస్తున్న పైలట్లంద‌రికీ స‌రైన అర్హత ఉందా? అనే అనుమానాన్ని ఈయూ ఏవియేష‌న్ సేఫ్టీ ఏజెన్సీ (ఈఏఎస్ఏ) వ్యక్తం చేసిందని ఆ సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. ఈయూ నిర్ణయంతో పీఐఏ పైలట్లంద‌రూ విశ్వాసాన్ని కోల్పోయారని వ్యాఖ్యానించారు.



97 మంది ప్రయాణికులను బలి తీసుకున్న కరాచీ విమాన ప్రమాదానికి పైల‌ట్ల నిర్లక్ష్యమే కార‌ణ‌మ‌ని తేలింది. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విమానం ల్యాండింగ్ అయ్యే స‌మ‌యంలో పైలట్లు కరోనా గురించి చర్చల్లో మునిగి తేలినట్లు వాయిర్ రికార్డుల ద్వారా వెల్లడైంది. అంతకుముందు విమానం చ‌క్రాల‌ను దించ‌కుండానే ల్యాండింగ్ చేయ‌డానికి పైల‌ట్లు ప్రయ‌త్నించిన‌ట్లు ద‌ర్యాప్తు తేలింది.

ఈ ఘటన తర్వాత పాక్ పైలట్ల తీరుపై అంత‌ర్జాతీయంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐక్యరాజ్య స‌మితి కూడా త‌మ సిబ్బందిని పాక్‌కు చెందిన విమానాల్లో ప్రయాణించ‌కూడ‌ద‌ని హెచ్చరించ‌డం గ‌మ‌నార్హం.





Untitled Document
Advertisements