డాక్టర్స్ డే: భర్తతో కలిసి కీలక ప్రకటన చేసిన జెనిలియా

     Written by : smtv Desk | Wed, Jul 01, 2020, 09:41 PM

డాక్టర్స్ డే: భర్తతో కలిసి కీలక ప్రకటన చేసిన జెనిలియా

కరోనా వైరస్ భయానక పరిస్థితుల మధ్య యావత్తు భారతదేశం నేషనల్ డాక్టర్స్ డే (జాతీయ వైద్యుల దినోత్సవం)ను జూలై 1న జరుపుకుంటోంది. వైద్యుల సేవలకు గౌరవ సూచికంగా ఈ రోజును జరుపుకుంటారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సమాజం కోసం పనిచేస్తూ, రోగులకు సేవలందించే వైద్యులకు నీరాజనంగా ఈ రోజును నిర్వహిస్తారు. ఇలాంటి మంచి రోజున జెనీలియా దేశ్‌ముఖ్,

రితేష్ దేశ్‌ముఖ్ దంపతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ అవయవాలను దానం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో జెనీలియా ఒక వీడియోను పోస్ట్ చేశారు.

ఈ వీడియోలో జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్ ఇద్దరూ కలిసి మాట్లాడారు. ‘‘దీని గురించి రితేష్, నేను చాలా కాలంగా ఆలోచిస్తున్నాం. దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు అమలు చేయలేకపోయాం. ఈరోజు డాక్టర్స్ డేను పురష్కరించుకుని మా అవయవాలను దానం చేస్తున్నట్టు ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ విషయంలో మాలో స్ఫూర్తినింపిన డాక్టర్ నోజర్ షెరీర్, FOGSIకి ధన్యవాదాలు. మరొకరికి జీవితాన్ని బహుమతిగా ఇవ్వడం కన్నా గొప్ప బహుమతి మరొకటి ఉండదు. ప్రతి ఒక్కరూ అవయవాలను దానం చేయాలని, జీవితాలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని జెనీలియా, రితేష్ వెల్లడించారు.
కాగా, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ వైద్యుడు డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జ్ఞాపకార్థం నేషనల్ డాక్టర్స్‌ డేను నిర్వహిస్తున్నారు. 1882 జూలై 1న జన్మించిన చంద్ర రాయ్.. అదే రోజున 1962లో 80 ఏళ్ల వయసులో కన్నుమూశారు. భారత అత్యుత్తమ పౌర పురస్కారం భారతరత్నను 1961 ఫిబ్రవరి 4న డాక్టర్ రాయ్ అందుకున్నారు.





Untitled Document
Advertisements