అంతక్రియలకు డబ్బుల్లేక శవాన్ని నదిలో పడేసిన కుటుంబం

     Written by : smtv Desk | Wed, Jul 01, 2020, 09:45 PM

అంతక్రియలకు డబ్బుల్లేక శవాన్ని నదిలో పడేసిన కుటుంబం

నిరుపేద కుటుంబం. దీనికి తోడు అనారోగ్యం. చూస్తుండగానే 30 ఏళ్ల ఆ మహిళకు ఆరోగ్యం క్షీణించింది. కుటుంబసభ్యులు 108 అంబులెన్స్ కోసం కాల్ చేశారు. కానీ, అవతలి నుంచి స్పందన లేదు. చేసేదేంలేక ఆమెను తోపుడు బండిపైకి ఎక్కించి జిల్లా ఆస్పత్రికి తరలించారు కుటుంబసభ్యులు. కానీ, ఫలితం లేకుండాపోయింది. ఆమె అప్పటికే ప్రాణాలు విడిచిందని వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికైనా అంబులెన్స్ ఏర్పాటు చేయాలని వాళ్లు అధికారులను వేడుకున్నారు. కానీ, మళ్లీ నిరాశే ఎదురైంది. దిక్కుతోచని స్థితిలో ఆ మహిళ మృతదేహాన్ని అదే తోపుడు బండిలో సమీపంలోని నది వద్దకు తీసుకొచ్చి నీటిలో విసిరేసి వెళ్లిపోయారు. ఈ హృదయవిదారక ఘటన మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో చోటు చేసుకుంది.

మృతదేహాన్ని సోన్ నదిలో విసిరేస్తుండగా.. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి తన సెల్ ఫోన్లో చిత్రీకరించాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు.

ఈ దురదృష్టకరమైన ఘటన వాస్తవమేనని సిధి జిల్లా అదనపు కలెక్టర్ డీపీ బర్మన్ తెలిపారు. మహిళ అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా కుటుంబసభ్యుల వద్ద డబ్బులు లేవని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ పథకాలపైనా వారికి సరైన అవగాహన లేదని తెలిపారు. ఘటన గురించి తెలుసుకున్న తర్వాత బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించినట్లు ఆయన వెల్లడించారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని.. అధికారుల తప్పు ఉన్నట్లు తేలితే, తగిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

తమ వద్దకు అధికారులు వచ్చి రూ.5000 ఆర్థిక సాయం చేశారని మృతురాలి భర్త మహేశ్ కోల్ తెలిపాడు. అంత్యక్రియలు నిర్వహించడానికి డబ్బులు లేకే మృతదేహాన్ని నదిలో వేశామని చెప్పాడు. అయితే.. ఆ దృశ్యాలను తాము వీడియో తీయలేదని, దారి వెంట వెళ్తున్న వారెవరో ఆ పని చేశారని అతడు చెప్పుకొచ్చాడు.

తన సోదరికి గ‌త కొద్ది రోజులుగా ఆరోగ్య పరిస్థితి బాగాలేదని మృతురాలి సోదరుడు రామావతార్ కోల్ తెలిపాడు. ఆదివారం (జూన్ 28) రోజున ఆమె ప‌రిస్థితి విష‌మించ‌డంతో అంబులెన్స్ స‌హాయం కోసం కాల్ చేశామని.. అటు నుంచి ఎలాంటి స్పంద‌న రాక‌పోవ‌డంతో తోపుడు బండి మీద ఆస్పత్రికి త‌ర‌లించామని అతడు తెలిపాడు.

ఆస్పత్రిలో ఆమెను ప‌రీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిన‌ట్లు చెప్పారని.. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి డ‌బ్బులు లేక‌పోవ‌డంతో అంబులెన్స్‌ను పంపాల‌ని ఆస్పత్రి వ‌ర్గాల‌ను, మున్సిపల్ అధికారులను కోరామని మహిళ సోదరుడు తెలిపాడు. ఆదివారం సెల‌వు రోజు కావ‌డంతో అందుకు వారు నిరాక‌రించారని చెప్పాడు. దీంతో చేసేదేమీ లేక సోన్ న‌దిలో మృతదేహాన్ని ప‌డేసినట్లు తెలిపాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు ఈశాన్యంగా 672 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది.





Untitled Document
Advertisements