అందుకే ఉద్యోగులకు జీతాలివ్వలేకపోయాం: ఏపీ మంత్రి

     Written by : smtv Desk | Wed, Jul 01, 2020, 09:50 PM

అందుకే ఉద్యోగులకు జీతాలివ్వలేకపోయాం: ఏపీ మంత్రి

టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు అధికారం కట్టబెట్టలేదని ప్రజలపై కక్ష సాధిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. విజయవాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించేలా అప్రాప్రియేషన్ బిల్లు ఆమోదం కాకుండా శాసన మండలిలో టీడీపీ నేతలు అడ్డుకున్నారని గుర్తు చేశారు. దీని వల్లే సకాలంలో జీతాలు ఇవ్వలేకపోయినట్లు వెల్లడించారు. గత ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకే చంద్రబాబు ఈవిధంగా వ్యవహరిస్తున్నారు.
బిల్లులను అడ్డుకోవడమే లక్ష్యంగా సభలో తెలుగుదేశం పార్టీ వ్యవహరించిందని మంత్రి కన్నబాబు అన్నారు. బిల్లును ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుని ఉద్యోగులకు జీతాలు రాకుండా చేశారన్నారు. ఈ విషయంలో ప్రజలకు, ఉద్యోగులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. క్షమాపణ చెబితే చంద్రబాబు సీనియారిటీని కాపాడుకున్న వారవుతారని పేర్కొన్నారు.

ఎక్కువ కాలం సీఎంగా, ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు.. ఉద్యోగుల జీతాలను అడ్డుకుని ఆ విషయంలో కూడా చరిత్ర సృష్టించారని మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు. పేదల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఫించన్లు ఇవ్వగలిగినట్లు పేర్కొన్నారు. నగదు రూపంలో డ్రా చేసి.. ఫించన్లు అందివ్వగలిగామని పేర్కొన్నారు. కానీ, ఉద్యోగుల జీతాలను ఈ విధంగా అందివ్వలేమని.. అందుకే సకాలంలో చెల్లించలేకపోయినట్లు వెల్లడించారు.

కాగా, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పొగాకు కొనుగోళ్ల ప్రక్రియను ప్రభుత్వమే ప్రారంభించిందని మంత్రి కన్నబాబు అన్నారు. రైతులకు నష్టం లేకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. రైతు భరోసా కేంద్రాలను మార్కెటింగ్ కేంద్రాలుగా మార్చే ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపారు.





Untitled Document
Advertisements