టెర్రరిస్ట్ వార్డులో 12 రోజులు ఉన్న శ్రీశాంత్

     Written by : smtv Desk | Thu, Jul 02, 2020, 10:02 AM

టెర్రరిస్ట్ వార్డులో 12 రోజులు ఉన్న శ్రీశాంత్

భారత ఫాస్ట్ బౌలర్ ఎస్. శ్రీశాంత్ కెరీర్ అత్యుత్తమ దశలో ఉన్నప్పుడు స్ఫాట్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. 2013 ఐపీఎల్ సీజన్‌లో శ్రీశాంత్ స్ఫాట్ ఫిక్సింగ్‌కి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఢిల్లీ పోలీసులు అప్పట్లో అరెస్ట్ చేశారు. దాంతో.. అతనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జీవితకాలం నిషేధం విధించగా.. కోర్టు ముందు సరైన సాక్షాధారాల్నిఢిల్లీ పోలీసులు ఉంచలేకపోవడంతో శ్రీశాంత్‌ని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయినప్పటికీ బీసీసీఐ ఆ నిషేధాన్ని ఎత్తివేయకపోవడంతో సుప్రీంకోర్టుకి శ్రీశాంత్ వెళ్లగా.. నిషేధాన్ని ఏడేళ్లకి కుదించారు. ఈ ఏడాది సెప్టెంబరుతో ఆ నిషేధం గడువు ముగియనుంది.
ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌పై తాజాగా ఓ ఇంటర్యూలో శ్రీశాంత్ మాట్లాడుతూ ‘‘ఆరోజు మ్యాచ్ పార్టీ ముగిసిన తర్వాత పోలీసులు నన్ను అరెస్ట్ చేసి.. టెర్రరిస్ట్ వార్డులో ఉంచారు. దాదాపు 12 రోజుల పాటు.. రోజుకి 16-17 గంటలు నరకం అనుభవించాను. ఆ సమయంలో నా ఫ్యామిలీ గురించే ఎక్కువగా ఆలోచించేవాడ్ని. కొన్ని రోజుల తర్వాత మా అన్న వచ్చి కుటుంబంలో అందరూ బాగున్నారు అని చెప్పిన తర్వాత కుదుటపడ్డాను. క్లిష్ట పరిస్థితుల్లో నా కుటుంబం నాకు అండగా నిలిచింది. గొప్ప ఉపశమనం ఏంటంటే..? నేను జైలుకి వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు ఎవరూ నా ఫొటోలు తీయలేదు. దాంతో.. నా పిల్లలు వాటిని చూసే బాధపడతారనే బెంగ లేదు’’ అని వెల్లడించాడు.

భారత్ తరఫున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లాడిన శ్రీశాంత్.. మొత్తం 169 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కొచీ టస్కర్స్, రాజస్థాన్ రాయల్స్ టీమ్స్‌కి ఆడిన శ్రీశాంత్.. 44 మ్యాచ్‌ల్లో 40 వికెట్లు పడగొట్టాడు.





Untitled Document
Advertisements