టిక్ టాక్‌కు మరో షాక్ ఇచ్చిన ఇండియా!

     Written by : smtv Desk | Thu, Jul 02, 2020, 10:11 AM

టిక్ టాక్‌కు మరో షాక్ ఇచ్చిన ఇండియా!

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన టిక్‌ టాక్‌కు భారత్‌లో మరో ఎదురుదెబ్బ తగిలింది. టిక్ టాక్‌కు మద్దతుగా తాను కోర్టులో వాదించబోనని దిగ్గజ న్యాయవాది తిరస్కరించారు. ఈ మేరకు భారత మాజీ అటర్నీ జనరల్‌ ముకుల్ రోహద్గీ స్పష్టం చేశారు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చైనా యాప్‌ తరపున తాను వాదించబోనని తేల్చి చెప్పారు. దేశానికి మద్దతు పలుకుతూ చైనా యాప్స్ కోసం వాదించేందుకు భారత్‌లో ఏ న్యాయవాది ముందుకు వచ్చే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, సైబర్ రక్షణను దృష్టిలో ఉంచుకొని చైనాకు సంబంధించిన 59 యాప్‌లను భారత ప్రభుత్వం సోమవారం నిషేధించిన సంగతి తెలిసిందే. టిక్‌ టాక్‌తో సహా హలో, యూసీ బ్రౌజర్, కామ్‌స్కానర్‌, పార్లల్ స్పేస్, విగో వీడియో, వీ చాట్ వంటి ప్రముఖ యాప్‌లు ఈ జాబితాలో ఉన్నాయి.

గత నెల 15న భారత్‌, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో భారత ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకోవడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఘర్షణలో భారత జవాన్లు 20 మంది అమరులైన సంగతి తెలిసిందే.

భారత ప్రభుత్వం తమ యాప్‌ను దేశ వ్యాప్తంగా నిషేధించడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు టిక్‌ టాక్‌ సంస్థ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా మాజీ అటర్నీ జనరల్‌ ముకుల్ రోహద్గీని తమ సంస్థ తరపున వాదించేందుకు నియమించుకుంది. అయితే, తాజాగా టిక్‌ టాక్‌ ఆఫర్‌ను ముకుల్ రోహద్గీ తిరస్కరించారు. దీంతో నిషేధంపై కోర్టుకు వెళ్లే క్రమంలో ఉన్న టిక్‌ టాక్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది.





Untitled Document
Advertisements